
హైదరాబాద్, మే 24: ఓ బాలుడిని దోసెలు ఎక్కువగా తింటున్నాడని, దీని వల్ల అన్నం సరిగ్గా తినడం లేదని తల్లి మందలించింది. ఆ మాత్రానికే చిన్న బుచ్చుకున్న బాలుడు ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరి వేసుకుని తనువు చాలించాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్‌లోని ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం (మే 23) చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లోని జ్ఞానీజైల్‌సింగ్ నగర్ బస్తీలో నివాసం ఉంటున్న చెన్నప్పకు భార్య, ఓ కుమారుడు ఉన్నాడు. కుమారుడు కార్తీక్ (15) స్థానికంగా ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. కార్తిక్‌కు కొంచెం దుడుకు స్వభావం ఉంది. చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా ఆలోచిస్తూ అతిగా స్పందించే వాడు. ఈ క్రమంలో నిన్న శనివారం ఉదయం కార్తిక్ తల్లి దోసెలు చేసింది. అయితే బాలుడు దోసె ఎక్కువగా తింటున్నాడని, అన్నం తినడం లేదని గమనించిన తల్లి మందలించింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న కార్తీక్ తీవ్ర మనస్తాపం చెందాడు.
ముభావంగా ఉన్న కార్తిక్ తండ్రి చెన్నప్ప మేస్త్రీ పనికి, తల్లి ఇళ్లలో పనికి వెళ్లడం గమనించాడు. అనంతరం తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పనులు ముగించుకుని ఇంటికి చేరిన తల్లిదండ్రులు తలుపు తెరచి కూడాగా ఉరికొయ్యకు కుమారుడు విగతజీవిగా వేలాడుతూ కనిపించడం చూసి బిక్కచచ్చిపోయారు. కుమారుడిని పట్టుకుని గుండెలవిసేలా రోధించారు. కాగా నేటి కాలంలో చిన్న చిన్న విషయాలకే యువత తీవ్రంగా స్పందిస్తున్నారు. రిమోట్ ఇవ్వలేదనీ, టీవీ చూడనివ్వలేదనీ, బాగా చదువుకోవాలని మందలించారనీ.. ఇలా అతి చిన్న కారణాలకే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుని కన్నోళ్లకు కుడుపుకోత మిగిలిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.