Ayodhya Trip: తెలుగు ప్రజలు అయోధ్యకు ఎలా వెళ్లాలి.? రైలు, బస్సు, విమాన మార్గాలు..

|

Jan 22, 2024 | 6:52 PM

దీంతో దేశ నలుమూలల నుంచి అయోధ్యకు వెళ్లేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. అయోధ్య రామయ్యను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున ప్రజలు ఆసక్తిచూపుతున్నట్లు పలు ట్రావెల్‌ సంస్థలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే తెలుగు ప్రజలు అయోధ్యకు ఎలా వెళ్లాలనే సందేహం సహజంగానే వస్తుంది...

Ayodhya Trip: తెలుగు ప్రజలు అయోధ్యకు ఎలా వెళ్లాలి.? రైలు, బస్సు, విమాన మార్గాలు..
Ayodhya journey
Follow us on

ఎన్నో ఏళ్ల కాల సాకారమైంది. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం అంగరంగవైభవంగా సాగింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా బాలరాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమం సోమవారం జరిగింది. దేశనలుమూలల నుంచి ఆహ్వానాలు అందుకున్న సెలబ్రిటీలు అయోధ్య బాటపట్టారు. ఇక జనవరి 23వ తేదీ నుంచి భక్తులందరికీ రాముల వారి దర్శనభాగ్యం కల్పించనున్నారు.

దీంతో దేశ నలుమూలల నుంచి అయోధ్యకు వెళ్లేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. అయోధ్య రామయ్యను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున ప్రజలు ఆసక్తిచూపుతున్నట్లు పలు ట్రావెల్‌ సంస్థలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే తెలుగు ప్రజలు అయోధ్యకు ఎలా వెళ్లాలనే సందేహం సహజంగానే వస్తుంది. ఇంతకీ హైదరాబాద్‌ నుంచి అయోధ్యకు ఎలా వెళ్లాలి.? రైలు, బస్సు, విమాన మార్గాల్లో ఎలా చేరుకోవాలి.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

రైలు మార్గంలో..

కాచిగూడ నుంచి అయోధ్యకు ప్రతీ శుక్రవారం రైలు అందుబాటులో ఉంది. ఈ రైలు యశ్వంత్‌ పూర్‌ నుంచి బయలు దేరీ తెలుగు రాష్ట్రాల మీదుగా గోరఖ్‌పూర్‌కు చేరుకుంటుంది. రైలు నెంబర్ 15024 రైలు ప్రతీ గురువారం రాత్రి 11.40 గంటలకు యశ్వంత్‌పూర్‌లో బయల్దేరుతుంది. ధర్మవరం, అనంతపూర్, కర్నూల్ సిటీ, మహబూబ్‌నగర్ స్టేషన్ల మీదుగా మరుసటి రోజు ఉదయం 10.40 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. అనంతరం శుక్రవారం కాచిగూడలో 10.50 గంటలకు బయలుదేరీ కాజీపేట్ జంక్షన్, సిర్పూర్ కాగజ్‌నగర్ స్టేషన్‌ల మీదుగా అయోధ్య ధామ్‌ జంక్షన్‌కు శనివారం సాయంత్రం 4.24 గంటలకు చేరుకుంటుంది. ఛార్జీల విషయానికొస్తే… స్లీపర్‌కు రూ. 680, థర్డ్‌ ఏసీకి రూ. 1810, సెకండ్‌ ఏసీ రూ. 2,625, ఫస్ట్‌ ఏసీకి రూ. 4,470గా నిర్ణయించారు.

రోడ్డు మార్గంలో అయోధ్యకు..

హైదరాబాద్‌ నుంచి పలు ప్రైవేట్ ట్రావెల్స్‌ అయోధ్యకు సర్వీసులను నడిపిస్తున్నాయి. ఏసీ బస్సులో ఒకరికి టికెట్‌ ధర రూ. 6వేలుగా ఉంటుంది. ఈ బస్సు నాగపూర్, జబల్ పూర్, ప్రయాగ్‌రాజ్ మీదుగా అయోధ్యకు చేరుకుంటుంది.

విమాన మార్గంలో..

ఇక విమానం విషయానికొస్తే శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్ నుంచి అయోధ్యకు విమానాలు అందుబాటులో ఉన్నాయి. అయితే నేరుగా కాకుండా ముంబయిలో విమానం మారాల్సి ఉంటుంది. రానున్న రోజుల్లో డిమాండ్‌కు అనుగుణంగా నేరుగా విమానాలు నడిపించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..