హైరైజ్‌తో హైటెన్షన్.. పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్లలో సేఫ్టీ ఎంత.. హాంకాంగ్ ప్రమాదం చెబుతున్నదేంటీ..?

హాంకాంగ్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం హైదరాబాద్‌లోని గేటెడ్ కమ్యూనిటీలలో తీవ్ర భయాందోళనలు రేపుతోంది. ఆధునిక ఎత్తైన భవనాల అగ్నిమాపక భద్రత, తరలింపు విధానాలు, గ్యాస్ పైప్‌లైన్‌ల భద్రతపై నివాసితులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బిల్డర్లు, అపార్ట్‌మెంట్ అసోసియేషన్లు అగ్నిమాపక నియమాలను, భద్రతా చర్యలను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ఈ సంఘటన గుర్తుచేస్తుంది. సురక్షిత జీవనం కోసం తక్షణ తనిఖీలు, మెరుగుదలలు తప్పనిసరి.

హైరైజ్‌తో హైటెన్షన్.. పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్లలో సేఫ్టీ ఎంత.. హాంకాంగ్ ప్రమాదం చెబుతున్నదేంటీ..?
Hyderabad High Rise Gated Communities Safety

Updated on: Nov 28, 2025 | 2:04 PM

హాంకాంగ్‌ చరిత్రలోనే ఘోర ప్రమాదంగా నిలిచిన అగ్నిప్రమాదంలో 94 మంది మరణించడం అందరినీ కలిచివేస్తోంది. వాంగ్ ఫక్ కోర్టు నివాస సముదాయంలోని అపార్ట్‌మెంట్‌లో జరిగిన ఈ ప్రమాదంలో 200 మందికి పైగా ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు. 72మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఈ ప్రమాదం హైదరాబాద్‌లోని గేటెడ్ కమ్యూనిటీల నివాసితుల్లో ఊహించని భయాన్ని, ఆందోళనను రేపుతోంది. సాధారణంగా తమ భద్రతపై పూర్తి నమ్మకంతో ఉండే సంపన్న అపార్ట్‌మెంట్లలో ఈ సంఘటన ప్రధాన చర్చనీయాంశంగా మారింది.

భగ్గుమన్న సేఫ్టీ డౌట్స్..

హాంకాంగ్‌లో ఆధునిక టవర్లు కూడా నిమిషాల వ్యవధిలో వేగంగా కూలిపోతున్న దృశ్యాలు, హైదరాబాద్ నివాసితుల సేఫ్టీ నమ్మకాన్ని దెబ్బతీశాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట, నర్సింగి, తెల్లాపూర్, మియాపూర్ వంటి ప్రాంతాల్లోని నివాసితులు ఈ విషాదం.. అత్యంత అధునాతన భవనాలు కూడా కొన్ని లోపాల వల్ల ఎంత దారుణంగా మారుతాయో గుర్తుచేస్తుందని అంటున్నారు. భవనం బయట ఉన్న సామగ్రి నుండి మొత్తం టవర్ బ్లాక్‌కు నిమిషాల్లో మంటలు వ్యాపించడం చాలా ఆందోళనకరంగా మారింది. హైదరాబాద్‌లో మంటలు సాధారణంగా షార్ట్ సర్క్యూట్‌లతో ముడిపడి ఉంటాయి. అయితే 30 నుంచి 50 అంతస్తులు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తు ఉన్న టవర్లలో ఇలాంటి పరిస్థితి వస్తే, తమ కమ్యూనిటీలు ఎంత సిద్ధంగా ఉన్నాయనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి.

చర్చకు దారితీసిన అంశాలు

ఈ హాంకాంగ్ ఎపిసోడ్ హైదరాబాద్ నివాసితులకు భద్రతా ప్రమాణాల చెకింగ్‌కు ఉపయోగపడింది. ప్రస్తుతం అనేక ముఖ్యమైన అంశాలపై ప్రజలు, బిల్డర్లు దృష్టి సారించారు. అందులో ప్రధానంగా ఇవి ఉన్నాయి..

ఇవి కూడా చదవండి
  • నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులలో అగ్నిమాపక భద్రతా నియమాలను ఎంత మేరకు పాటిస్తున్నారు?
  • భవనం ముఖభాగాన్ని పునరుద్ధరించే సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఎంత ఉంది?
  • ఎత్తైన భవనాలలో అగ్నిమాపక వ్యవస్థల వాస్తవ పరిధి, సామర్థ్యం ఏమిటి?
  • అగ్నిమాపక వ్యవస్థలకు క్రమం తప్పకుండా తనిఖీలు జరుగుతున్నాయా? అలారాలు సరిగా పనిచేస్తున్నాయా?
  • ఇలాంటి అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు కమ్యూనిటీలలో ఉన్న గ్యాస్ పైప్‌లైన్‌ల భద్రత ఏమిటి?
  • 30 అంతస్తులు పైబడిన టవర్లలో తరలింపు విధానాలు నిజంగా ఆచరణాత్మకమైనవేనా?

ప్రస్తుతం బిల్డర్లు, అపార్ట్‌మెంట్ సంఘాల ప్రతినిధులు కూడా ఎక్కడ లోపాలు ఉన్నాయి.. ఏ నివారణ చర్యలను బలోపేతం చేయాలి అనే అంశాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఒకప్పుడు అత్యంత సురక్షితమైన జీవన రూపంగా భావించిన గేటెడ్ కమ్యూనిటీల భద్రతపై ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతుండడం గమనార్హం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.