Gulab Cyclone: గులాబ్ తుపాన్ ప్రభావంతో హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ ప్రభావంతో వచ్చే రెండు రోజులపాటు హైదరాబాద్ నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) అప్రమత్తమైంది. ఈ మేరకు మూడు రోజులపాటు హై అలర్ట్ ప్రకటించింది. జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, హెచ్‌ఓడీలు అవసరమైన చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఫోన్ కాల్స్‌కు తక్షణమే స్పందించేలా చర్యలు తీసుకోవాలని, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పడవలు, పంపులు, ఇతర అవసరమైన పరికరాలు, యంత్రాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.
హైదరాబాద్‌తోపాటు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. భాగ్యనగరవాసులు తప్పనిసరి అయితే తప్ప బయటికి రావొద్దని బల్దియా సూచించింది. గతేడాది ఇబ్బందులు ఎదురైన చోట ముందుగానే డీఆర్‌ఎఫ్ సిబ్బంది అందుబాటులో ఉండాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు వారంరోజుల పాటు ఉద్యోగులకు సెలవులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
ముంపు ప్రాంతాల నుంచి బాధితుల్ని తరలించేందుకు శిరిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముంపు ప్రమాదమున్న ప్రాంతాలవాసులను ముందుగానే హెచ్చరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు హైదరాబాద్ కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు అవసరమైతే హెల్ప్ లైన్ నెంబర్ 040- 2320 2813 కు సంప్రదించాలని తెలిపారు. తాజా ఆదేశాల మేరకు కలెక్టరేట్‌లో ఇద్దరు అధికారులు అందుబాటులో ఉండాలని.. ఫోన్లకు తక్షణమే స్పందించాలని కలెక్టర్ ఎల్.శర్మన్ ఆదేశాలు జారీ చేశారు.
Also Read: