హైదరాబాద్‌ను (Hyderabad) వాన వదలడం లేదు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎకధాటిగా కురుస్తున్న వానలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యయి. మరోవైపు.. భారీ వర్షాలు కంటిన్యూ అవుతాయన్న వెదర్ రిపోర్ట్ అంచనాలు మరింత కంగారు పెడుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో ఇవాళ (సోమవారం) కూడా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు తెలిపారు. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ (Orange Alert) జారీ చేశారు. నిన్న (ఆదివారం) రోజంతా హైదరాబాద్ వ్యాప్తంగా చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి. సండే హాలీడే కావడంతో సరదాగా బయటకు వెళ్లాలనుకునే వారు నిరాశకు లోనయ్యారు. పనుల కోసం బయటికొచ్చిన వాహనదారులు చినుకులతో తడిసిపోయారు. గ్యాప్ లేకుండా పడ్డ వర్షానికి రహదారులన్నీ చిత్తడిగా మారాయి. ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు రాష్ట్రవ్యాప్తంగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని చెబుతున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదిలి వాయుగుండంగా బలపడింది. ఈ వాయుగుండం పశ్చిమ వాయవ్యదిశగా కదిలి దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్ మీదుగా వెళుతూ క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని అధికారులు వివరించారు. భారీ వర్ష సూచనతో జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. గత నెలలో భారీ వర్షాలు కురవడంతో జిల్లాల్లోని చెరువులన్నీ నిండుకుండల్లా మారాయి. కృష్ణా, గోదావరి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటే ప్రమాదాలు జరిగే అవకాశముందని ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. సోమవారం భారీగా, మంగళవారం ఒక మోస్తరు వానలు కురిసే సూచనలున్నట్లు వాతావరణశాఖ తెలిపింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం