రాష్ట్ర ఆవిర్భావం అనంతరం వెలువడిన తొలి గ్రూప్-1కు దరఖాస్తులు భారీగా వస్తున్నాయి. సోమవారం వరకు 2.94 లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. నేడు చివరి రోజు కావడంతో ఈ సంఖ్య 3 లక్షలు దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం 503 పోస్టులతో కూడిన తెలంగాణ తొలి గ్రూప్-1 ప్రకటనకు సోమవారం రాత్రి 10 గంటల వరకు 2,94,644 దరఖాస్తులు వచ్చాయి. ఉమ్మడి రాష్ట్రంలో 2011లో 312 పోస్టులతో వెలువడిన గ్రూప్-1 ప్రకటనకు 3 లక్షల మందికిపైగా దరఖాస్తు చేశారు. గ్రూప్-1 కోసం రోజుకు సగటున 10వేల దరఖాస్తులు వస్తే… సోమవారం ఒక్కరోజే 32 వేలు వచ్చాయి. సర్వర్‌పై ఒత్తిడి పెరగకుండా, అభ్యర్థులకు సాంకేతిక ఇబ్బందులు రాకుండా కమిషన్, సీజీజీ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మంగళవారం చివరిరోజు కావడంతో భారీగా వస్తాయని అంచనా వేస్తున్నారు.
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను జూన్ చివరి వారం లేదా ఆగస్టులో నిర్వహించే అవకాశాలు ఉన్నాయని, ఈ మేరకు ప్రాథమికంగా టీఎస్‌పీఎస్సీ ప్రకటనలో తెలిపింది. అయితే ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు మరింత సమయం కావాలని నిరుద్యోగ అభ్యర్థులు, విద్యార్థి సంఘాల నుంచి కమిషన్‌కు అభ్యర్థనలు వస్తున్నాయి. గ్రూప్-1 ప్రకటన సుదీర్ఘకాలం తరువాత వెలువడిందని, సన్నద్ధమయ్యేందుకు అవకాశమివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికీ గ్రూప్-1 మెటీరియల్ మార్కెట్‌లో సిద్ధంగా లేదు. ఇటు పోలీసు కానిస్టేబుల్, ఎస్‌ఐ ఉద్యోగాలకు కూడా దరఖాస్తులు భారీగానే వస్తున్నాయి.