AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్‌ ప్రజలకు గుడ్‌న్యూస్‌.. ఉచిత తాగునీటి పథకం గడువు పొడిగింపు

GHMC Water Scheme: హైదరాబాద్ నగర పాలకసంస్థ (జీహెచ్ఎంసీ) పరిధిలోని ప్రజలు ఉచిత మంచినీటి పథకం పొందే అవకాశాన్ని ఈనెల 31వ తేదీ వరకు పొడిగించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక

Hyderabad: హైదరాబాద్‌ ప్రజలకు గుడ్‌న్యూస్‌.. ఉచిత తాగునీటి పథకం గడువు పొడిగింపు
Hyderabad Water Supply
Shaik Madar Saheb
|

Updated on: Dec 15, 2021 | 8:04 PM

Share

GHMC Water Scheme: హైదరాబాద్ నగర పాలకసంస్థ (జీహెచ్ఎంసీ) పరిధిలోని ప్రజలు ఉచిత మంచినీటి పథకం పొందే అవకాశాన్ని ఈనెల 31వ తేదీ వరకు పొడిగించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. జలమండలి ఎండీ దానకిశోర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజల కోసం ప్రభుత్వం గత డిసెంబరులో నెలకు 20 వేల లీటర్ల ఉచిత మంచినీటిని అందించే పథకాన్ని ప్రకటించింది. జనవరి 12వ తేదీన మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు లాంఛనంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. ఉచిత మంచినీటి పథకాన్ని వినియోగించుకోవడానికి వినియోగదారులు తమ నల్లా కనెక్షన్లకు తప్పనిసరిగా మీటర్లు ఏర్పాటు చేసుకోవడంతో పాటు తమ క్యాన్ (CAN) నెంబరుకు ఆధార్ లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పథకం ద్వారా వీరు ఉచితంగా నెలకు 20 వేల లీటర్ల వరకు మంచినీటిని పొందవచ్చు. అయితే, బస్తీల్లో నివసించే వినియోగదారులు మీటర్లు అమర్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ, క్యాన్కు ఆధార్ అనుసంధానం మాత్రం చేసుకోవాల్సి ఉంటుంది.

అర్హులంతా పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా.. ఈ పథకం పొందడానికి గానూ మీటరు అమర్చుకొని, క్యాన్ నెంబరుకు ఆధార్ లింక్ చేసుకోవడానికి గతంలో ఆగస్టు 15 వరకు జలమండలి అవకాశం ఇచ్చింది. అయితే, కొంతమంది ఇంకా మీటరు అమర్చుకోలేదు, మరికొందరు క్యాన్ నెంబరుకు ఆధార్ లింక్ చేసుకోలేదు. ఇది గుర్తించిన జలమండలి గతంలో ఇచ్చిన గడువును పొడిగించి అర్హులంతా ఈ పథకాన్ని పొందే వీలు కల్పించాలని భావించింది. ఈ నేపథ్యంలోనే 20 వేల లీటర్ల ఉచిత మంచినీటి పథకాన్ని పొందేందుకు గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది.

నెలకు 20 వేల లీటర్ల వరకు ఉచితం: జనవరి 1 నుంచి గృహ వినియోగదారులు అందరికీ బిల్లులు జారీ చేయడం జరుగుతుంది. కానీ ఉచిత మంచినీటి పథకానికి నమోదు చేసుకున్న వారికి నెలకు 20 వేల లీటర్ల వరకు నీటిని వాడుకుంటే బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదు. 20 వేల లీటర్ల పైన నీటిని వినియోగించుకుంటే మాత్రం 20 వేల లీటర్ల కంటే ఎంత ఎక్కువ వాడుకుంటే అంత నీటికి మాత్రమే నల్లా బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది.

ఈ నెల 31 నాటికి నల్లాలకు మీటరు అమర్చుకోని, ఆధార్ లింక్ చేసుకోని వారికి 2020 డిసెంబరు నుంచి ఈ డిసెంబరు 31, 2021 వరకు కూడా రాయితీ లేని బిల్లులు జారీ చేస్తారు. అయితే, ఈ బిల్లులపై ఎటువంటి పెనాల్టీలు, వడ్డీ వసూలు చేయరు. అదేకాకుండా వినియోగదారులు నాలుగు వాయిదాల్లో ఈ మొత్తం బిల్లును చెల్లించుకునే వెసులుబాటు ఉంటుంది.

పాత బకాయిలను చెల్లించాలి: ఉచిత మంచినీటి పథకాన్ని ప్రకటించే ముందు(01.12.2020) బకాయిలు ఉన్న వినియోగదారులు మాత్రం ఆ బకాయిలను చెల్లించాల్సి ఉంటుంది. ఆ బిల్లుపై అప్పటికే ఉన్న పెనాల్టీలు, వడ్డీ కూడా కట్టాల్సి ఉంటుంది.

20 వేల లీటర్ల పథకాన్ని సద్వినియోగం చేసుకోండి: దానకిశోర్ జీహెచ్ఎంసీ పరిధిలో ఉచిత తాగునీటి పథకానికి అర్హులైన వినియోగదారులు నీటి మీటర్ల ఏర్పాటు, నల్లా కనెక్షన్ కు ఆధార్ అనుసంధాన ప్రక్రియ డిసెంబరు 31 లోపు పూర్తి చేసుకుని ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జలమండలి ఎండీ దానకిశోర్ సూచించారు. ఇప్పటికే డొమెస్టిక్ వినియోగదారులు తమ క్యాన్ నెంబర్ ను ఆధార్ తో అనుసంధానం చేసుకోవడానికి మీ-సేవ కేంద్రాల్లో కానీ, జలమండలి వెబ్ సైట్ లో లాగిన్ అయ్యి కూడా అధార్ అనుసంధానం చేసుకునే అవకాశాన్ని కల్పించామని తెలిపారు. వినియోగదారులకు ఏమైనా సందేహాలు ఉంటే జలమండలి కస్టమర్ కేర్ నెంబర్ 155313 నెంబరుకు ఫోన్ చేయవచ్చు.

Also Read:

Robbery: హాలీవుడ్ సినిమాను తలపించిన భారీ దోపిడి.. డ్రైనేజ్ పగులగొట్టి.. ఏసీ పైప్‌ల నుంచి దూరి..

Diabetes Diet: డయాబెటిస్‌ అదుపులో ఉండాలా..? మధ్యాహ్నం సమయంలో ఈ ఐదు ఆహారాలు చేర్చడం ముఖ్యం..!