Hyderabad: గ్యాస్ కష్టాలు.. భారీ నష్టాల్లో హైదరాబాద్‌లోని హోటల్స్.. లాస్ ఎంతంటే?

హైదరాబాద్ నగరంలో ఎల్పీజీ కొరత తీవ్ర ప్రభావం చూపుతోంది. గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే నిర్వహణ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో, గ్యాస్ కొరత కారణంగా వ్యాపారం దెబ్బతినడంతో రెస్టారెంట్లు 40 నుంచి 45 శాతం వరకు నష్టాలు చవిచూస్తున్నాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

Hyderabad: గ్యాస్ కష్టాలు.. భారీ నష్టాల్లో హైదరాబాద్‌లోని హోటల్స్.. లాస్ ఎంతంటే?
Hyderabad Lpg Shortage

Edited By:

Updated on: Mar 24, 2026 | 5:00 PM

దేశ వ్యాప్తంగా గ్యాస్ కొరత నేపథ్యంలో ఎల్పీజీ సిలిండర్ల ధరలు రూ. 4,000 నుంచి 7,000లకు దూసుకెళ్లాయి. దీంతో గ్యాస్ సరఫరా అంతరాయాలు కొనసాగడం వల్ల రెస్టారెంట్ యజమానులు గ్యాస్‌కు ప్రత్యామ్నాయంగా ఫైర్‌వుడ్ వినియోగించాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే, గ్యాస్ కొరత వల్ల ఈ కట్టెల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. సాదారణ రోజుల కంటే ఇప్పుడు కిలోకు రూ. 6 నుంచి 11 వరకు చేరాయి. దీంతో ఖర్చులు మరింత పెరిగి, లాభాలు గణనీయంగా తగ్గిపోయాయి. గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో చాలా హోటళ్లు మంటల కట్టెలపై ఆధారపడాల్సి వస్తోంది.

అయితే కట్టెలతో వంట చేయడం సమయం ఎక్కువ తీసుకుంటోంది. గ్యాస్‌తో 30-35 నిమిషాల్లో అయ్యే వంట, ఇప్పుడు గంటకు పైగా సమయం పడుతోంది. దీంతో కస్టమర్లకు సేవలు ఆలస్యమవుతున్నాయి. కొంతమంది కస్టమర్లు ఈ ఆలస్యాన్ని భరించలేక వెనుదిరుగుతున్నారు. ఇది ప్రభావం ప్రత్యక్షంగా రెస్టారెంట్ ఆదాయంపై పడుతోంది. దీనికి తోడు ఇంధన ఖర్చులు పెరగడంతో కొందరు హోటళ్లు తమ మెనూలను తగ్గించుకోవాల్సి వచ్చింది. కొన్ని ఐటమ్స్‌ను పూర్తిగా తొలగించడంతో పాటు, కొందరు వ్యాపారులు తాత్కాలికంగా తమ అవుట్‌లెట్లను మూసివేయాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. పీక్ అవర్స్‌లో కూడా సేవలు అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

వ్యాపారులు చెబుతున్న వివరాల ప్రకారం, ఈ పరిస్థితి కొనసాగితే చిన్న, మధ్య తరహా రెస్టారెంట్లు నిలబడటం కష్టమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని హోటళ్లు రోజువారీ కార్యకలాపాలను తగ్గించగా, మరికొన్ని పూర్తిగా మూసివేసే పరిస్థితి కూడా రావచ్చని హెచ్చరిస్తున్నారు. మొత్తానికి, ఎల్పీజీ కొరత నగర హోటల్ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గ్యాస్ సరఫరా త్వరగా సాధారణ స్థితికి రాకపోతే, రెస్టారెంట్ వ్యాపారం మరింత కష్టాల్లో పడే ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us