
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో మత్తు బాగోతం వెలుగుచూసింది. నగర శివారులోని కిస్మత్‌పూర్ ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న గంజాయి సాగును పోలీసులు గుర్తించారు. పైకి చూస్తే అది ఓ సాధారణ తోటలా కనిపించినా.. లోపల మాత్రం నికార్సయిన సాగు జరుగుతుండటం స్థానికులను షాక్‌కు గురిచేసింది. ఈ ఘటనలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాజేందర్ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రాథమిక విచారణలో కీలక విషయాలు బయటపడ్డాయి. రాజేందర్ తానే స్వయంగా గంజాయి మొక్కలను సాగు చేస్తూ.. స్థానిక యువకులకు వాటిని సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. గంజాయి సాగును కప్పిపుచ్చేందుకు ఆయుర్వేదిక్ మెడిసిన్‌ల విక్రయాల ముసుగును రాజేందర్ వాడుకున్నాడు. ఔషధ మొక్కల పేరుతో గంజాయి మొక్కలను పెంచుతూ.. ఎవరికి అనుమానం రాకుండా చూసుకున్నాడు. కానీ ఇటీవల పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం అతని గుట్టును రట్టు చేసింది.
స్పాట్‌కి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు మొక్కలను స్వాధీనం చేసుకుని.. రాజేందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరైనా ప్రమేయం ఉందా? ఎంతకాలంగా ఈ అక్రమ సాగు కొనసాగుతోంది? అన్న కోణాల్లో పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టారు. నగర శివారుల్లోనూ, నివాస ప్రాంతాలకు సమీపంలోనూ గంజాయి సాగు జరుగుతుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. మత్తు పదార్థాలపై పోలీసుల నిఘా మరింత కఠినంగా కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..