మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి(Konda Vishweshwar Reddy) బీజేపీలో(BJP) చేరారు. హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఆదివారం జరిగన బీజేపీ విజయ సంకల్ప సభా వేదికగా ఆయన బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆయనను కాషాయ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ తరుణ్ చుగ్, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ల సమక్షంలో కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీలో చేరారు.
మాజీ డిప్యూటీ సీఎం కేవీ రంగారెడ్డి మనవడు కొండా విశ్వేశ్వరరెడ్డి చేవెళ్ల నుంచి ఎంపీగా ఎన్నికై 16వ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. మొదట టీఆర్ఎస్ టికెట్‌పై ఆయన ఎంపీగా గెలిచారు. 2013లో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్నప్పుడు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆహ్వానం మేరకు కొండా విశ్వేశ్వరరెడ్డి ఆ పార్టీలో చేరారు. అయితే.. 2018లో ఆయన టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన ఆయన కాంగ్రెస్‌లో చేరారు. కానీ, కాంగ్రెస్‌లోనూ ఆయన ఎక్కువ కాలం కొసాగలేకపోయారు. గతేడాది మార్చిలో కాంగ్రెస్ పార్టీకి ఆయన రాజీనామా చేశారు. తాజాగా, బీజేపీ కండువా కప్పుకున్నారు.