హైదరాబాద్ రాయదుర్గం(Raidurg) హైమార్క్ ఛాంబర్స్ భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గ్రాండ్ స్పైసీ బావర్చి హోటల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. బిల్డింగ్ రెండో అంతస్తులో మంటలు చెలరేగి మూడో అంతస్తుకు వ్యాపించాయి. హోటల్‌లోని వారు భయంతో పరుగులు తీశారు. ఊపిరాడక కొందరు కిందికి వచ్చేయగా ఇంకొందరు టెర్రస్‌పైకి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకువచ్చారు. బిల్డింగ్‌లో చిక్కుకుపోయినవారిని కాపాడేందుకు బాహుబలి స్కై లిఫ్ట్ క్రేన్‌ను ఉపయోగించారు ఫైర్ ఫైటర్స్. 14 మందిని కాపాడటంలో స్కై లిఫ్ట్ క్రేన్ కీ రోల్ పోషించింది. ఇటీవలే తెలంగాణ(Telangana) ఫైర్ డిపార్ట్‌మెంట్ ఈ స్కై లిఫ్ట్‌ను కొనుగోలు చేసింది. ఈ స్కై లిఫ్ట్‌తో 15 అంతస్తుల వరకు చేరుకోవచ్చు. బిల్డింగ్ మూడో అంతస్తు అద్దాలను పగులగొట్టి స్కై లిఫ్ట్‌తో 14 మందిని కాపాడారు ఫైర్ ఫైటర్స్. దట్టమైన పొగ వల్ల ఊపిరాడక ఇబ్బందిపడిన వారికి ప్రాథమిక చికిత్స అందించారు. 3 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు ఫైర్ ఫైటర్స్. షార్ట్ సర్క్యూటే అగ్ని ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. పొగ వల్ల కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.
రెస్క్యూ ఆపరేషన్‌లో బాహుబలి స్కై లిఫ్ట్ క్రేన్ అందరి దృష్టిని అట్రాక్ట్ చేసింది. స్కై లిఫ్ట్‌తో ఫైర్ ఫైటర్స్ పైకి వెళ్లి బిల్డింగ్ అద్దాలు పగులగొట్టడం, టెర్రస్ పైన చిక్కుకున్న వారిని కిందకు దించడాన్ని చుట్టు పక్కల ప్రజలు ఆసక్తిగా చూస్తుండిపోయారు. స్కై లిఫ్ట్‌ను తెలంగాణ ఫైర్ డిపార్ట్‌మెంట్ ఇటీవల కొనుగోలు చేసింది. దాన్ని సమయానికి రప్పించి రెస్క్యూ ఆపరేషన్‌లో ఉపయోగించారు.