Hyderabad Old City Crime News: హైదరాబాద్ నగరంలో రెండ్రోజులుగా ఒక్కసారిగా భార్యాభర్తల మధ్య ఉన్న మనస్పర్థలు హత్యాయత్నాలకు దారితీస్తున్నాయి. మాటలతో మొదలైన వివాదాలు హత్యలకూ వెనకాడడం లేదు. పాతబస్తీలో ఈ హత్యల ఘటనలను కలకలం రేపుతున్నాయి. పాతబస్తీ ఫలక్‌నుమా వట్టేపల్లికి చెందిన రెహమతుల్లా, షాహనాజ్‌బేగం దంపతులు. వీరిద్దరి మధ్య మనస్పర్దలతో ఇటీవల భర్త నుంచి దూరంగా వచ్చి పుట్టింట్లోనే ఉంటోంది. రెహమతుల్లా కూడా తన తల్లితో కలిసి ఉంటున్నాడు. భార్యను తీసుకురావాలని రెహమతుల్లా తల్లి.. కొడుక్కు సర్దిచెప్పడంతో అత్తగారింటికి వెళ్లాడు రెహమతుల్లా. ఇంటికి వెళ్లి మాట్లాడుతున్న రెహమతుల్లాతో భార్య షాహనాజ్ బేగం, బావమరుదుల అజహార్, రఫిక్ గొడవపడ్డారు. గొడవ తీవ్రంకావడంతో రెహమతుల్లా అక్కడి నుంచి ఇంటికి వెళ్లేందుకు బయటకు వచ్చాడు. కోపంతో రగిలిపోయిన బావమరిది రఫిక్.. బావ రెహమతుల్లాపై ఒక్కసారిగా కర్రలతో విరుచుకుపడ్డాడు. అతడికి మరో బావమరిది తోడయ్యాడు. భార్య ఎంతగా ప్రతిఘటించినా వినకుండా దాడి చేయండంతో రెహమతుల్లాకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలతోనే పోలీసులను ఆశ్రయించాడు రెహమతుల్లా. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఛత్రినాకలో..
హైదరాబాద్ పాతబస్తీ ఛత్రినాకలో దంపతుల మధ్య తలెత్తిన మనస్పర్ధలతో భార్య పుట్టింటికి వెళ్లింది. అలిగిన భార్యను తీసుకురావడానికి పెద్దమనుషులతో కలిసి అత్తగారింటి వెళ్లాడు ముస్తాక్. అత్తగారి కుటుంబసభ్యులతో చర్చిస్తుండగా ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. ఈ ఘర్షణలో ఇరువర్గాలకు చెందినవారికి గాయాలు కావడంతో పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో ఇరువర్గాలను పిలిచి కౌన్సిలింగ్ ఇస్తున్నారు.
లంగర్‌హౌజ్‌లో..
హైదరాబాద్ లంగర్‌హౌజ్‌లో భార్యభర్తల మధ్య తలెత్తిన గొడవ.. రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. హుమేరా నూరి, సైఫ్‌కసేరి భార్యాభర్తలు. కొంతకాలంగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఇక భర్తతో ఏగలేనని భావించిన భార్య.. తన పుట్టింటికి వెళ్లింది. తనపై అలిగి వెళ్లిన భార్యను తీసుకొచ్చేందుకు భర్త సైఫ్ అత్తవారింటికి వెళ్లాడు. అక్కడ భార్యతో మాట్లాడుతుండగా మాటామాట పెరిగింది. భార్య తరఫు బంధువులు ఒక్కసారిగా సైఫ్‌పై దాడికి యత్నించడంతో వివాదం మరింత ముదిరింది. ఇరువర్గాల మధ్య తీవ్రంగా కొట్టుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. గాయాలైన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఇరువర్గాలు పరస్పర ఫిర్యాదులతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ కేసులో మరో ట్విస్ట్ ఉంది. అదేంటంటే.. సైఫ్ భార్య హుమేరా భర్తపై పలు ఆరోపణలు చేసింది. తన భర్త ఎందుకూ పనికిరానివాడని.. నిత్యం పొటేల్ పందాలు ఆడుతూ డబ్బు వృథా చేశాడని ఆరోపించింది. అంతేకాదు.. పొట్టేలు పందాలకు డబ్బు కోసం తనను తీవ్రంగా వేధించేవాడని కన్నీరుమున్నీరుగా విలపించింది. భార్య ఆరోపణలను తిప్పికొట్టాడు భర్త సైఫ్. తాను బాగానే డబ్బు సంపాదిస్తున్నానని.. కావాలనే ఆరోపణలు చేస్తోందన్నాడు.
-నూర్ మహమ్మద్, టీవీ9 ప్రతినిధి, హైదరాబాద్
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: