‘సార్ మమ్మల్ని ఆదుకోండి..’ సీఎం రేవంత్‌కు 2008 డీఎస్సీ అభ్యర్థుల అభ్యర్ధన..
2008లో నాటి రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 6వ తేదీన 35 వేల పోస్టులతో మెగా డీఎస్సీని ప్రకటించింది. ఎస్జీటీ పోస్టులను కామన్ మెరిట్ ప్రకారం భర్తీ చేస్తామని, బీఈడీ, డీఈడీ అభ్యర్థులు అర్హులని చెప్పింది. సుమారు 50 రోజుల తర్వాత ఎస్జీటీ పోస్టుల్లో 30 శాతం డీఈడీ అభ్యర్థులకు కేటాయిస్తూ 2009 జనవరి 29వ తేదీన జీవో నంబర్ 28ను తీసుకొచ్చింది.
2008లో నాటి రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 6వ తేదీన 35 వేల పోస్టులతో మెగా డీఎస్సీని ప్రకటించింది. ఎస్జీటీ పోస్టులను కామన్ మెరిట్ ప్రకారం భర్తీ చేస్తామని, బీఈడీ, డీఈడీ అభ్యర్థులు అర్హులని చెప్పింది. సుమారు 50 రోజుల తర్వాత ఎస్జీటీ పోస్టుల్లో 30 శాతం డీఈడీ అభ్యర్థులకు కేటాయిస్తూ 2009 జనవరి 29వ తేదీన జీవో నంబర్ 28ను తీసుకొచ్చింది. బీఈడీ అభ్యర్థులు కోర్టుకు వెళ్లగా కామన్ మెరిట్ ప్రకారం భర్తీ చేయాలని కోర్టు తీర్పు ఇచ్చింది. ప్రభుత్వం నియమించిన కేబినెట్ సబ్ కమిటీ కూడా కామన్ మెరిట్ ప్రకారం భర్తీ చేయాలని సూచించింది. దీంతో నోటిఫికేషన్ ప్రకారమే ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం 2010 జూన్ 21న.. జీవో 27ను విడుదల చేసింది. దీని ప్రకారం అధికారులు నియామక కౌన్సిలింగ్ ప్రక్రియను ప్రారంభించారు.
జిల్లాల వారీగా కామన్ మెరిట్ ప్రకారం ఎంపికైన అభ్యర్థుల జాబితాను అధికారులు ప్రకటించారు. 2009 జూన్ 27వ తేదీన కౌన్సిలింగ్ ప్రక్రియ కూడా మొదలైంది. డీఈడీ అభ్యర్థులు పరిపాలన ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా.. జూన్ 28న కౌన్సిలింగ్‌పై స్టే విధించింది. జీవో 28 ప్రకారం 30 శాతం కోటా కల్పిస్తూ కౌన్సిలింగ్ నిర్వహించాలని ట్రిబ్యునల్ ఆదేశించింది. దీంతో అధికారులు కౌన్సిలింగ్ నిలిపివేశారు. ఆ తర్వాత 30 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కొత్త మెరిట్ లిస్టు విడుదల చేసి 2010లో ఉద్యోగాలు ఇచ్చారు. దీంతో మంచి మార్కులు సాధించినా ఉద్యోగం రాక ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 3500 మంది బీఈడీ అభ్యర్థుల కలలు కుప్పకూలిపోయాయి. ఇందులో తెలంగాణ అభ్యర్థులు 1200 మంది వరకు ఉన్నారు. అప్పటి నుంచి వారు తమకు న్యాయం చేయాలని ప్రభుత్వం చుట్టూ.. కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ధర్నాలు, రాస్తా రోకోలు, నిరాహార దీక్షలు.. ఇలా అన్ని ప్రయత్నాలు చేశారు. 2013 జూలై 15న సుప్రీంకోర్టు బీఈడీ అభ్యర్థులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఉద్యోగాలు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సూచించింది. అయినా నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే న్యాయం చేస్తామని చెప్పి ఇందిరా పార్కులో హామీ ఇచ్చిన టీఆర్ఎస్.. అధికారంలోకి వచ్చాక మాట మార్చింది.
2016 జనవరి 3వ తేదీన నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా బీఈడీ అభ్యర్థుల ప్రతినిధులను సచివాలయానికి పిలిపించుకున్నారు. వారికి జరిగిన అన్యాయాన్ని వారం రోజుల్లోగా సరిదిద్దాలని అధికారులను ఆదేశించారు. పని పూర్తయ్యే వరకు ఇక్కడే ఉండాలంటూ మంజీరా గెస్ట్ హౌస్‌లో సదుపాయం కల్పించాలని చెప్పారు. ప్రతినిధుల బృందం దాదాపు వారం రోజుల పాటు మంజీరా గెస్ట్ హౌస్‌లో ఉండి ఎదురు చూశారు. కానీ హామీ అమలు చేయలేదు. ఆ తర్వాత వరంగల్‌లో నిర్వహించిన బహిరంగ సభలో కూడా నష్టపోయిన బీఈడీ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. 2017 ఫిబ్రవరి 8వ తేదీన రాష్ట్ర హైకోర్టులో జస్టిస్ సంజయ్ కుమార్ నేతృత్వంలోని బెంచ్, 27 సెప్టెంబర్ 2022న హైకోర్టు ధర్మాసనం బీఈడీ అభ్యర్థులకు అనుకూలంగా తీర్పునిచ్చాయి. పిటిషనర్లకు ఉద్యోగాలు ఇవ్వాలని ఆదేశించింది. అయినా కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదు. తాజాగా ఈనెల 8వ తేదీన రాష్ట్ర హైకోర్టు డీఎస్సీ 2008 బాధితుల పట్ల సానుకూల నిర్ణయం తీసుకోవాలని గురువారం తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. ప్రస్తుతం ఖాళీల్లో వారిని భర్తీ చేయండి లేదా.. నష్టపోయిన బీఎడ్ అభ్యర్థులకు ఏపీలో మాదిరిగా కనీసం కాంట్రాక్ట్ పద్దతిలో అయినా ఉద్యోగాలు ఇవ్వండని ఆదేశించింది. ఏపీలో దాదాపు రెండున్నర సంవత్సరాల కింద డీఎస్సీ 2008 బాధితులకు కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు ఇచ్చారు. తాజా తీర్పు ప్రకారం మరో 50 మందికి పోస్టింగ్స్ ఇచ్చారు. దాదాపు 15 సంవత్సరాలుగా న్యాయం కోసం ఎదురు చూస్తున్నామని.. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వమైనా తమకు న్యాయం చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.