ప్రాణం పోసే డాక్టర్లే ప్రాణం తీశారు. పండంటి బిడ్డలు పుట్టారన్న కన్నవాళ్ల ఆనందాన్ని ఆవిరి చేశారు. హైదరాబాద్ ఫలక్‌నూమాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జరిగిందీ దారుణం. డాక్టర్ల అంతులేని నిర్లక్ష్యానికి విగతజీవులుగా మారిన పసికందులను చూసి బాధిత కుటుంబాలు గుండెలు బాదుకున్నాయి. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నిన్న రెండు డెలివరీలు జరిగాయి. డెలివరీ తర్వాత పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని బంధువులకు సమాచారమిచ్చారు డాక్టర్లు. ఆ కాసేపటికే ఆరోగ్యం క్షీణించిందన్నారు. పసివాళ్లకు ఏమవుతుందోనన్న ఆందోళనతో కుటుంబసభ్యులు వేరే ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన అక్కడి డాక్టర్లు పిల్లలిద్దరూ చనిపోయారని నిర్ధారించారు.
ఇద్దరు చిన్నారుల ఛాతి, పొట్ట భాగాల్లో కాలిన గాయాలున్నాయి. పుట్టినప్పుడు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని.. అప్పుడు ఎలాంటి గాయాలు లేవన్నారు బంధువులు. పిల్లలకు వేడి కోసం.. ఇంక్యుబేటర్లో పెట్టారన్నారు. ఆ సమయంలోనే వేడి ఎక్కువై.. శిశువుల ఛాతి, పొట్ట సమీపంలో గాయాలై మృతి చెందారని మృతుల బంధువులు ఆరోపించారు. ఇదేంటని అడిగితే.. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా స్పందించారని మండిపడ్డారు.
పసికందులను చూసి మురిసిపోయేలోపే.. చనిపోయారన్న వార్తతో బంధువులంతా శోకసంద్రంలో మునిగిపోయారు.
బాధిత కుటుంబం ఫిర్యాదుతో పోలీసులు విచారిస్తున్నారు.