
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. కొన్నిగంటల పాటు కవిత నివాసంలో సోదాలు చేపట్టిన ఈడీ అధికారులు.. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు తరలించారు. రాత్రి 8:45 గంటల ఫ్లైట్ కు టికెట్లు బుక్ చేసిన ఈడీ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి కవితను ఢిల్లీకి తీసుకెళ్లారు. ఈడీ సోదాలపై కవిత లాయర్ సోమా భరత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఎలాంటి చర్యలు ఉండవన్న ఈడీ.. ఇలా సోదాలు చేయడం సరికాదన్నారు. కోర్టులో కేసు ఉండగా సడెన్‌గా సోదాలు జరపడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఢిల్లీ లిక్కర్ కేసు తీవ్ర సంచలనం రేపుతోంది. ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ ఎమ్మెల్సీ కవితకు మరింత ఉచ్చు బిగించింది. శుక్రవారం హైదరాబాద్‌కు ఢిల్లీ నుంచి వచ్చిన ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు (ఈడీ) కవిత ఇంట్లో సోదాలు నిర్వహించి సాయంత్రం కవితను అరెస్టు చేశారు. అరెస్ట్‌పై కవిత ఇంటి వద్ద కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అయితే కవితను అరెస్ట్ చేయడంపై పొలిటికల్ లీడర్స్ పలు రకాలగా రియక్షన్ ఇస్తున్నారు.
కవితకు సంబంధించిన కేసు అంశం సుప్రీంకోర్టులో ఉండగా ఆమెను అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. అలాగే కవిత విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతోందన్నని బీజేపీ నేత ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. అలాగే ఈ అంశానికి బీజేపీతో ఎలాంటి సంబంధం లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కామెంట్స్..
ఇదిలా ఉండగా, కవిత అరెస్ట్‌పై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించారు. ఎమ్మెల్సీ కవితను ఎప్పుడో అరెస్టు చేయాల్సి ఉందని, రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ ఎన్నికల ముందు కవితను అరెస్ట్ చేసిందంటూ వ్యాఖ్యానించారు. ఇంతకాలం కవితను బీజేపీ ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. కవిత అరెస్టుతో ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో రాష్ట్రంలో మూడో నాలుగో స్థానాలను గెలవచ్చని బీజేపీ ఆశ పడుతోందని, బీజేపీ, బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్.. గల్లీల కొట్లాట ఢిల్లీలో దోస్తీ అంటూ కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు.
లక్షల కోట్ల అవినీతి పాల్పడిన కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ చెబుతుందన్నారు. మరికొన్ని గంటల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతున్న సమయంలో కవితను అరెస్ట్ చేయడంపై సందేహాలు వ్యక్తం చేశారు. ఇది మ్యాచ్ ఫిక్సింగ్ కావొచ్చన్నారు.