తెలంగాణ సహ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది జరగనున్న సాధారణ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమైంది. హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణా హోటల్‌లో ఈ సమావేశం జరుగుతోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కొత్తగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తొలి సమావేశం ఇది. రెండు రోజుల పాటు ఈ సమావేశం జరగనుంది. ఈ మధ్య కాలంలో ఢిల్లీ వెలుపల CWC సమావేశం జరగడం ఇదే మొదటిసారి. ఈ సమావేశంలో పాల్గొనేందుకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహ కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక, హైదరాబాద్ వచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు నేతలకు ఘన స్వాగతం పలికాయి. ఈ ఉన్నతస్థాయి సమావేశం పార్టీకి, తెలంగాణ రాజకీయాలకు ఒక మార్పుగా నిలుస్తుందని కాంగ్రెస్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. పునర్‌వ్యవస్థీకరించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో 39 మంది సభ్యులు, 32 మంది శాశ్వత ఆహ్వానితులు, 13 మంది ప్రత్యేక ఆహ్వానితులు ఉన్నారు.
రెండు రోజుల CWC సమావేశాల్లో రేపు విస్తృతస్థాయి భేటీ జరగనుంది. ఇవాళ్టి సమావేశంలో CWC సభ్యులు, శాశ్వత ఆహ్వానితులు, ప్రత్యేక ఆహ్వానితులు, కాంగ్రెస్ పాలిత నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. రేపటి భేటీలో పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నాయకులు, ఇతర సీనియర్ నేతలు పాల్గొంటారు. ఈ సమావేశంలో అధిక శాతం సంస్థాగత విషయాలే చర్చిస్తామని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. ఆ తర్వాత పొత్తులపై చర్చలు ఉంటాయని వెల్లడించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలందరి అభిప్రాయాలు తెలుసుకుంటామని తెలిపారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించి ఒక నిర్ణయానికి వస్తామని వెల్లడించారు.
CWC సమావేశాల ప్రారంభం సందర్భంగా తాజ్‌కృష్ణా హోటల్ ప్రాంగణంలో కాంగ్రెస్ నేతలు జాతీయ జెండా ఎగరేశారు. ఈ కార్యక్రమంలో ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక సహ CWC సభ్యులందరూ పాల్గొన్నారు.
సోనియాగాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. తాజ్‌కృష్ణలో పార్టీ కండువా కప్పి ఆయన్ను సోనియాగాంధీ, ఖర్గే పార్టీలోకి ఆహ్వానించారు. ఈ ఉదయమే బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు తుమ్మల. తన రాజీనామా లేఖను బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌కు పంపారు. నేడు తుమ్మలతో పాటు ఆయన అనుచరులు మరో 17 మంది కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..