
హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ జాహనుమా ప్రాంతంలోని ఓ సెలూన్ షాప్‌లో ట్రీమ్మింగ్ కోసం వచ్చిన ఓ వ్యక్తి సందు చూసి దొంగతనానికి పాల్పడ్డాడు. జెన్యూన్ కస్టమర్ మాదిరిగానే షేవింగ్ చెయ్యమని కోరాడు. అప్పటివరకు ఏమీ తెలియనట్లు అమాయకంగా నటించాడు. కావాల్సిన కటింగ్, షేవింగ్ చేయించుకున్నాడు. ఇక ఎప్పుడెప్పుడు అవకాశం చిక్కుతుందా అని ఎదురుచూశాడు. ఆ షాపు యజమాని చాలాసేపటి వరకు అలెర్ట్‌గా ఉండటంతో.. ఆ దొంగకు వీలు చిక్కలేదు. ఇక అంతా పూర్తయ్యాక అతను షాపులో డబ్బులు చెల్లించి తిరిగి వెళ్లిపోవాల్సిన సమయం వచ్చింది. ఇంతలో ఆ షాప్ యజమాని నీళ్లు తీసుకురావడాని కోసమని బయటికి వెళ్లబోయాడు. ఇక ఇదే మంచి సమయం అనుకున్నాడో ఏమో.. ఇంతకన్నా అవకాశం మరొకటి దొరకదు అనుకున్నాడో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా షాప్‌లో ఉన్న కటింగ్, షేవింగ్ సామాన్లు చేతికి చిక్కినవి తీసుకుని జేబులో పెట్టేసుకున్నాడు. ఎవరైనా చూస్తున్నారేమో అటూ ఇటూ చూశాడు. ఏమీ ఎరగనట్లు అక్కడే ఉన్న షాప్ యజమానికి షేవింగ్ నిమిత్తం ఇవ్వాల్సిన డబ్బులను చేతిలో పెట్టి అక్కడ నుంచి మెల్లగా జారుకున్నాడు.
అప్పటివరకు ఈ విషయం తెలియని షాప్ యజమాని.. వేరే కస్టమర్లు వచ్చినప్పుడు కటింగ్ చేయడానికి పెట్టుకున్న తన సామాన్లు అక్కడ కనిపించకపోవడంతో షాకయ్యాడు. అసలేం జరిగింది.. షాప్‌లో సామాన్లు ఎక్కడికి పోతాయని ఆలోచించి సీసీ కెమెరాలను చెక్ చేయడం మొదలుపెట్టాడు. అక్కడ రికార్డయిన దృశ్యాలను చూసి లబోదిబోమంటూ ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది చూసినవారంతా ఇలా షాప్‌లోకి కస్టమర్ లాగా వచ్చి దొంగతనాలు కూడా చేస్తున్నారా అని ఆశ్చర్యపోయారు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో బొత్తిగా అర్థం కావడం లేదని, ప్రస్తుతం రోజులు అలా ఉన్నాయని అంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..