
తెలంగాణలో (Telangana) వరదలు పోటెత్తుతున్నాయి. రాష్ట్రంలో వరద సహాయం, పునరావాస కార్యక్రమాలపై సీఎస్ సోమేశ్ (CS Somesh Kumar) కుమార్ సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 19,071 మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు వెల్లడించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదల వల్ల పరిస్థితి అదుపులోనే ఉందని, ఏ విధమైన నష్టం జరగలేదని సీఎస్ తెలిపారు. గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తున్న ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలపై మరింత అప్రమత్తంగా ఉన్నామని పేర్కొన్నారు. ముంపు బాధితుల కోసం రాష్ట్రంలో 223 ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. కాగా.. భద్రాద్రి రాముని ఆలయానికి వరద తాకింది. దీంతో భద్రాచలం (Bhadrachalam) పట్టణం చిగురుటాకులా వణికిపోతోంది. పలు కాలనీలు నీట మునిగాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. వర్షాకాలం సీజన్ ప్రారంభంలోనే ఈ స్థాయిలో వరద రావడంతో మరో రెండు నెలలు పరిస్థితులు ఎలా ఉంటాయోనని తీర్ ప్రాంత ప్రజలు ఆందోళన చెదుతున్నారు. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 61.5 అడుగులకు చేరింది.
మరోవైపు.. ఏపీలోని ధవళేశ్వరం వద్ద గోదావరి వరద భారీగా ఉంది. ప్రస్తుతం నీటిమట్టం 16 అడుగులు దాటింది. పోలవరం ప్రాజెక్టుకూ వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టు నుంచి ప్రస్తుతం 15 లక్షలకు పైగా క్యూసెక్కుల నీరు స్పిల్ వే ద్వారా బంగాళాఖాతం వైపు పరుగులు పెడుతోంది. భారీగా వస్తున్న వరదను దృష్టిలో ఉంచుకుని పోలవరం ప్రాజెక్టులోని 48 క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాగా.. 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకునేలా పోలవరం (Polavaram) ప్రాజెక్టు స్పిల్ వే గేట్లను నిర్మించారు. ఒక్కో గేటును 16 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పుతో ఏర్పాటు చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..