
అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 9 ఏళ్ల బాలిక శివాని తప్పిపోవడం కలకలం రేపింది. అయితే పక్కనే ఉన్న రెండు పోలీస్ స్టేషన్ల మధ్య సరైన సమన్వయం లేకపోవడంతో బాలిక ఆచూకీ గుర్తించడానికి నాలుగు రోజుల సమయం పట్టింది. ఈ ఘటన పోలీసు శాఖలోని కమ్యూనికేషన్ లోపాలను బహిర్గతం చేసింది. డిసెంబర్ 16న అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సులేమాన్ నగర్, పిల్లర్ నంబర్ 208 సమీపంలో ఉన్న డైమండ్ మిషన్ స్కూల్ వద్ద శివాని ఆడుకుంటూ తప్పిపోయింది. బాలిక కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ ఫిర్యాదు నమోదు చేశారు.
అదే రోజు రోడ్డు పక్కన ఒంటరిగా నడుస్తున్న బాలికను రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన పెట్రోల్ మొబైల్ సిబ్బంది గుర్తించారు. అయితే బాలిక తన ఇంటి చిరునామా చెప్పలేకపోవడంతో, స్థానికుల నుంచి సమాచారం లభించకపోవడంతో ఆమెను సురక్షితంగా చైల్డ్ హోమ్స్‌కు తరలించారు. ఈలోగా అత్తాపూర్ పోలీసులు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా, రాజేంద్రనగర్ పోలీసులు బాలికను తీసుకెళ్లిన దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. వెంటనే రాజేంద్రనగర్ పోలీసులను సంప్రదించి, చైల్డ్ హోమ్స్ నుంచి శివానిని రప్పించారు. రాజేంద్రనగర్ జోన్ డీసీపీ యోగేష్ గౌతమ్ సమక్షంలో బాలికను కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఈ ఘటన పక్కపక్కనే ఉన్న రెండు పోలీస్ స్టేషన్ల మధ్య కనీస సమాచారం పంచుకోకపోవడం వల్ల ఏర్పడిన గందరగోళాన్ని వెలుగులోకి తెచ్చింది. మిస్సింగ్ చైల్డ్ కేసుల్లో తక్షణమే ఇన్‌ఫర్మేషన్ షేరింగ్ జరగకపోవడం, పొరుగు స్టేషన్ల మధ్య కమ్యూనికేషన్ లోపం వల్ల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసు శాఖలో రియల్‌టైమ్ డేటా షేరింగ్ వ్యవస్థ అవసరమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. మిస్సింగ్ చైల్డ్ ఫిర్యాదు వచ్చిన వెంటనే పొరుగు పోలీస్ స్టేషన్లకు అలర్ట్ చేయడం, స్కూల్స్కా, లనీల్లోని సీసీటీవీ నెట్‌వర్క్‌ను పోలీస్ వ్యవస్థతో అనుసంధానం చేయడం, పిల్లలకు ఐడెంటిటీ కార్డులు లేదా ట్రాకింగ్ సౌకర్యాలు కల్పించడం వంటి చర్యలు తీసుకోవాలంటున్నారు.
ఈ ఘటనలో శివాని సురక్షితంగా కుటుంబానికి చేరుకున్నప్పటికీ, పోలీసు వ్యవస్థలో సమన్వయం మరింత మెరుగుపరచాల్సిన అవసరాన్ని ఈ సంఘటన స్పష్టంగా చూపించింది.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..