Telangana: పార్లమెంట్ పోరుకు కాంగ్రెస్ కసరత్తు.. ఎంపీ టికెట్ ఎవర్ని వరించేనో.?

|

Feb 06, 2024 | 8:00 AM

పార్లమెంటు ఎన్నికల్లో టార్గెట్‌ 17పై దృష్టి పెట్టిన హస్తం పార్టీ.. అభ్యర్థుల ఎంపికపై దృష్టిపెట్టింది. దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ముగియడంతో..జాబితాను సిద్ధం చేసే పనిలో పడింది. గాంధీభవన్‌లో నేడు సమావేశం కానున్న పీఈసీ..ఆశావహుల పేర్లను షార్ట్‌లిస్ట్‌ చేయనుంది.

Telangana: పార్లమెంట్ పోరుకు కాంగ్రెస్ కసరత్తు.. ఎంపీ టికెట్ ఎవర్ని వరించేనో.?
Congress
Follow us on

పార్లమెంటు ఎన్నికల్లో టార్గెట్‌ 17పై దృష్టి పెట్టిన హస్తం పార్టీ.. అభ్యర్థుల ఎంపికపై దృష్టిపెట్టింది. దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ముగియడంతో..జాబితాను సిద్ధం చేసే పనిలో పడింది. గాంధీభవన్‌లో నేడు సమావేశం కానున్న పీఈసీ..ఆశావహుల పేర్లను షార్ట్‌లిస్ట్‌ చేయనుంది. అయితే ఆ నియోజకవర్గాలు మాత్రం హస్తం పార్టీని టెన్షన్‌ పెడుతున్నాయి. ఇంతకూ ఏంటా నియోజకవర్గాలు..? వాటిపై కాంగ్రెస్‌ వ్యూహం ఏంటి..?

అసెంబ్లీ ఎన్నికల్లో సత్తాచాటిన హస్తం పార్టీ..పార్లమెంటు ఎన్నికల్లోనూ జోరు కొనసాగించాలని భావిస్తోంది. ఎన్నికల్లో పోటీచేసేందుకు ఆశావహులు పెద్దసంఖ్యలో దరఖాస్తు చేయడంతో అభ్యర్ధుల వడపోతపై అధిష్ఠానం దృష్టిసారించింది. వచ్చిన దరఖాస్తులను నియోజకవర్గం వారీగా గాంధీ భవన్​ వర్గాలు జాబితాను సిద్ధం చేస్తున్నాయి. గాంధీ భవన్‌లో నేడు జరిగే ప్రదేశ్ ఎన్నికల కమిటీలో ఈ జాబితాపై చర్చజరగనుంది. నియోజకవర్గాల వారీగా ఇద్దరు లేక ముగ్గురు నేతలను పీఈసీ ఎంపిక చేసి ఆ జాబితాను అధిష్ఠానానికి పంపుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన ఈ విధానాన్నే పార్లమెంటు ఎలక్షన్స్‌లోనూ ఫాలో కావాలని పార్టీ భావిస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి అధ్యక్షతన జరిగే భేటీలో.. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ హరీశ్​ చౌదరీ, సభ్యులు జిగ్నేశ్ మేవానీ, విశ్వజిత్ కధమ్, ఏఐసీసీ ఇంఛార్జ్​ కార్యదర్శులు, పీఈసీ కమిటీ సభ్యులు పాల్గొంటారు.

17 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు 300 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. అత్యధికంగా మహబూబాబాద్ నుంచి 47, వరంగల్ నుంచి 40 దరఖాస్తులు వచ్చాయి. అతి తక్కువగా మహబూబ్​నగర్ నుంచి 4, జహీరాబాద్ నుంచి 6, మెదక్ నుంచి 10 దరఖాస్తులు వచ్చినట్టు కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఖమ్మం, నల్గొండ, నాగర్‌కర్నూలు, వరంగల్, మహబూబాబాద్‌, మల్కాజ్‌గిరి స్థానాల్లో అభ్యర్ధిని ఎంపిక చేయడం.. పార్టీకి తలనొప్పిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

ఖమ్మం ఎంపీ సీటుకోసం కాంగ్రెస్‌లో బిగ్‌ఫైట్‌ నడుస్తోంది. కాంగ్రెస్‌ ఫైర్‌బ్రాండ్‌, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఇప్పటికే ఖమ్మం గడ్డ ..నా అడ్డా అని బహిరంగంగా ప్రకటించారు. సోనియా పోటీ చేయకపోతే తనదే టికెట్ అంటూ ఖర్చీఫ్ వేసుకుని కూర్చున్నారు. ఇక డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని, కాంగ్రెస్ సీనియర్ వీహెచ్‌ కూడా ఖమ్మం సీటుకు దరఖాస్తు చేసుకున్నారు. మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్‌రెడ్డి కూడా ఎంపీ టికెట్‌ రేసులో ఉన్నారు.

ఉమ్మడి నల్గొండలోని రెండు ఎంపీ సీట్లకు కూడా తీవ్రమైన పోటీ ఉంది. నల్గొండ సీటు కోసం జానారెడ్డి కుమారుడితో పాటు ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పడంతో.. సూర్యాపేట బరి నుంచి తప్పుకున్న పటేల్‌ రమేష్‌రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. వీరిద్దరిలో ఎవరికి ఈ టికెట్ వస్తుందో ఉత్కంఠగా మారింది. ఇక భువనగిరిలో ట్రై యాంగిల్ ఫైట్ ఉంది. చామల కిరణ్‌కుమార్ రెడ్డితో పాటు..కోమటిరెడ్డి బంధువు మురళి, సూర్యాపేట డీసీసీ అధ్యక్షుడు వెంకన్న సైతం భువనగిరి కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇక ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన నాగర్‌కర్నూల్‌ సీటు కోసం మల్లు రవి, మందా జగన్నాథంతో పాటు చారకొండ వెంకటేశ్​, సంపత్​కుమార్ మధ్య ఫైట్‌ నడుస్తోంది. మహబూబ్‌నగర్ నుంచి కాంగ్రెస్ సీనియర్లు సంపత్ కుమార్, వంశీచంద్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఇక సిట్టింగ్‌ స్థానమైన మల్కాజ్‌గిరి టికెట్‌ను సినీ నిర్మాత బండ్ల గణేశ్​, హరివర్ధన్​రెడ్డి, సర్వే సత్యనారాయణ ఆశిస్తున్నారు.

శాసనసభ ఎన్నికల్లో టికెట్‌ లభించని వారితో పాటు, ఓటమి పాలైన పలువురు నేతలు కూడా టికెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వీరితో పాటు అధిష్ఠానం హామీతో అసెంబ్లీ ఎన్నికల బరినుండి తప్పుకున్న నేతలు కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఒక్కో నియోజకవర్గానికి సగటున 18 మందికి పైగా నేతలు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. దీంతో అభ్యర్థి ఎంపిక పార్టీకి కత్తిమీదసాములా మారింది. మరి ఈ గండాన్ని హస్తం పార్టీ ఏ విధంగా అదిగమిస్తుందో చూడాలి.