
అగ్నిపథ్(Agnipath) విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) తీవ్రంగా స్పందించారు. సైనికుల పెన్షన్ బడ్జెట్ పెరగకూడదనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ స్కీమ్‌ను తీసుకొచ్చిందని విమర్శించారు. డబ్బులు మిగుల్చుకునేందుకు మోదీ సర్కార్ ప్రణాళికలు రూపొందిస్తోందనని ఆరోపించారు. దేశ భద్రతలో కేంద్రం రాజీ పడుతోందని మండిపడ్డారు. మాజీ సైనికుడిగా కేంద్రం తీరును ఖండిస్తున్నానని ఉత్తమ్ వెల్లడించారు. కాగా.. సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ పథకంపై పలు రాష్ట్రాల్లో ఆందోళనలు మిన్నంటాయి. పాత పద్ధతిలోనే సైన్యం నియామక ప్రక్రియ చేపట్టాలని పెద్ద ఎత్తున యువత రోడ్డెక్కింది. పలు చోట్ల నిరుద్యోగుల నిరసనలు హింసాత్మకంగా మారాయి.సికింద్రాబాద్రైల్వే స్టేషన్ లో పలు ట్రైన్లకు నిప్పంటించారు. పరిస్థితి చేయి దాటగా.. రైల్వేశాఖ వివిధ జోన్లలో ప్రయాణించే రైలు సర్వీసుల్లో మార్పులు చేసింది. కొన్ని రైళ్లను పూర్తిగా రద్దు చేయగా.. మరికొన్నింటిని తాత్కాలికంగా నిలిపివేసింది.
మరోవైపు.. అగ్నిపథ్ పథకంపై తీవ్ర ఆగ్రహావేశాలు, నిరసనలు నెలకొన్నవేళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ప్రజల్లో దేశభక్తి, జాతీయ భావనను పెంచాలనే లక్ష్యంతో సుదీర్ఘ ఆలోచనలు, చర్చలు జరిగిన తర్వాతే ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఈ విషయంలో యువతను తప్పుదారి పట్టించే ప్రయత్నం సరికాదని హితవు పలికారు. పథకం ప్రకారమే సికింద్రాబాద్(Secunderabad) లో విధ్వంసం సృష్టించారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచంలోని అనేక దేశాల్లో ‘అగ్నిపథ్’ వంటి పథకాలు ఏళ్లుగా అమల్లో ఉన్నాయన్న కేంద్ర మంత్రి దేశ సేవ చేయాలన్న తపన ఉన్నవాళ్లే అగ్నిపథ్‌లో పాల్గొంటారని వెల్లడించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి