Bakery Items: తస్మాత్‌ జాగ్రత! రోగాలు తిని తెచ్చుకోకండి

ఒంటి నిండా కలర్‌ కొట్టుకుని, అద్దాల బాక్సులో అందంగా కూర్చుని, చూడగానే ఆకర్షించేలా ఉంటాయి. చటుక్కున క్యాష్‌ కొట్టి, లటుక్కున నోట్లో వేసుకోవాలనిపిస్తాయి. అయితే తిన్నారో తస్మాత్‌ జాగ్రత! రోగాలు తిని తెచ్చుకోకండి. బేకరీ ఫుడ్స్‌తో భద్రం బీకేర్‌ఫుల్‌. ఆ వివరాలు ఈ కథనంలో

Bakery Items:  తస్మాత్‌ జాగ్రత! రోగాలు తిని తెచ్చుకోకండి
Bakery Items

Updated on: Jun 29, 2025 | 5:49 PM

స్వీట్ షాపులో ఆరెంజ్‌ కలర్‌లో చేగొడిలు…చూడగానే తినాలనిపిస్తున్నాయి కదూ! ఇక జాంగ్రీ… కలర్‌ఫుల్లుగా మేకప్‌ వేసుకుని మిమ్మల్ని టెమ్ట్ చేస్తోంది కదూ. బేకరీల్లో ఏ ఫుడ్‌ ఐటమ్‌ చూసినా సరే, కలర్‌ఫుల్‌గా ఉంటాయి. కళ్లను ఇట్టే ఆకట్టుకుంటాయి. చూడగానే నోరూరిపోయి తినాలనిపిస్తుంది. వాటిని అలా కళ్లతో చూడగానే కడుపులో వేయాలనిపిస్తుంది. కానీ  ఆ పదార్థాలు అన్నీ నేచురల్‌గా ఉండే కలర్‌ కంటే ఎక్కువగా ఉన్నాయి అని మీరు గమనించారు. ఇక జెల్లీస్‌ అయితే రకరకాల కలర్స్‌లో ఆకట్టుటాయి. ఆ జుజుబీలు చూస్తే చాలు నోట్లో నీళ్లూరుతాయి. ఇవన్నీ చూడగానే తినాలనిపిస్తాయి కదా! వీటన్నింటిని కలర్స్‌లో ముంచి తీశారు. వస్త్రాలకు రంగులు వేసినట్లు, మీరు తినే తిండికి కూడా రంగులు వేస్తున్నారు. హంగులు చేస్తున్నారు. ఆ రంగులు హంగులు పొంగులు చూసి తింటే మీకు రంగు పడడం ఖాయం. ఉరుకులుపరుగుల జీవితం, వండుకుని తినే ఓపిక తీరికా లేకుండాపోయింది. దీంతో చాలామంది బయట తినాల్సి వస్తోంది. ఇదే ఇప్పుడు శాపంగా మారింది.

ఇక కేకులు తింటే కెవ్వు కేక్‌ కాదు…చావు కేక వేయాల్సి వస్తుంది. రస్కులు తింటే ఆస్పత్రికి పరిగెత్తాల్సిందే! హైదరాబాద్‌ మహా నగరంలోని ఏ బేకరీలో చూసినా ఇదే సీన్‌. కలర్ ఎక్కువ…క్వాలిటీ తక్కువ ఫుడ్సే కనిపిస్తున్నాయి. కేకులు, దిల్ పసందులు, కలర్‌ఫుల్‌ చాక్లెట్లు, సమోసాలు , వెజ్ నాన్ వెజ్ పఫ్‌లు, క్రీమ్ బ్రెడ్లు,చేగోడీలు…ఇలా ఏదైనా సరే కలర్‌ పాయిజన్‌ పులుముకుని కళకళలాడిపోతున్నాయి. బేకర్‌ ఫుడ్‌ తింటే..ఆస్పత్రి బెడ్‌ ఎక్కాల్సిందే అన్నట్లుంది పరిస్థితి.

GHMC కమిషనర్ RV కర్ణణ్ స్పెషల్ ఫోకస్ చేయడంతో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారుల బృందాలు హైదరాబాద్ వ్యాప్తంగా దాడులు చేశాయి. 200కి పైగా బేకరీలు, స్వీట్ షాప్ లపై ఆకస్మిక తనిఖీలు చేసి ఆహార పదార్థాలను సీజ్ చేసి నాచారంలోని తెలంగాణ ఫుడ్ సేఫ్టీ లేబరీటరీకి పంపారు. అక్కడ భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. ఆహార పదార్థాల్లో మోతాదుకు మించి కలర్స్‌ వాడుతున్నట్లు నిర్ధారణ అయింది. ఏ కలర్ అయినా FSSI గైడ్‌లైన్స్ ప్రకారం…100PPM కంటే ఎక్కువ ఉండకూడదు. కానీ చాలా చోట్లు 200PPM వరకు కలర్స్‌ యాడ్‌ చేస్తున్నారు.  ఇవి కెమికల్స్‌ ఉండే సింథటిక్‌ కలర్స్. ఇవి తింటే మీ ఆరోగ్యం మటాష్‌ అంతే.  కల్తీ రాయుళ్లు సీజన్‌ని బట్టి బేకరీ ఐటమ్స్‌ని కల్తీ చేస్తూ ఉంటారని, వాటిలో కలర్స్‌ యాడ్ చేస్తుంటారని నాచారం ఫుడ్ సేఫ్టీ లేబరేటరీ సీనియర్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌ వాణి చెబుతున్నారు. అందుకే మీరు బయట కొనే తినుబండారాలతో తస్మాత్ జాగ్రత్త.

మనం తినే బేకరీ ఫుడ్ ఐటమ్స్‌ని కలర్స్‌తో ఏ విధంగా కల్తీ చేస్తున్నారు అన్నదానిపై ఫుడ్ సేఫ్టీ అధికారి వాణి…డెమో ఇచ్చారు. దీనిపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కరస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు. దిగువన వీడియోలో చూడండి..