CM Revanth Reddy: తెలంగాణ విజన్ డాక్యుమెంట్ విడుదల చేసిన సీఎం రేవంత్.. 10 కీలక అంశాలు

తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. 83 పేజీలతో కూడిన ఈ డాక్యుమెంట్‌ను తెలంగాణ మీన్స్ బిజినెన్ పేరుతో రిలీజ్ చేశారు. 10 కీలక అంశాలతో ఉన్న ఈ డాక్యుమెంట్‌లో మహిళలు, రైతులు. యువతకు ప్రాధాన్యత కల్పించారు.

CM Revanth Reddy: తెలంగాణ విజన్ డాక్యుమెంట్ విడుదల చేసిన సీఎం రేవంత్.. 10 కీలక అంశాలు
Cm Revanth Reddy

Updated on: Dec 09, 2025 | 9:40 PM

ప్యూచర్ సిటీలో జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో తెలంగాణ రైజింగ్ విజన్-2047ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. రెండు ప్రధాన అంశాలు, మూడు రీజియన్లు, త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ లక్ష్యంతో ఈ డాక్యుమెంట్‌ను మంగళవారం రిలీజ్ చేశారు. పక్క రాష్ట్రాలతో కాదని, అభివృద్ధి చెందిన దేశాలతోనే పోటీ పడుతూ తెలంగాణను గ్లోబల్ హబ్‌గా తయారు చేయడమే లక్ష్యంగా ఈ డాక్యుమెంట్‌ను రూపొందించింది. 2047 నాటికి ఏ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలి? ఏ ఏరియాలో ఏమేం పరిశ్రమలను ప్రోత్సహించాలి? ప్రపంచంలోనే అత్యుత్తమ కంపెనీలను రాష్ట్రానికి ఎలా ఆకర్షించాలనే దానిపై రోడ్ మ్యాప్‌ను ఆవిష్కరించారు. గత అనుభవాలు.. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని విజన్ 2047 డాక్యుమెంట్ తయారుచేశారు.

విజన్ డాక్యుమెంట్‌లోని 10 అంశాలు

-2034 నాటికి వన్ ట్రిలియన్ డాలర్ల ఎకానమీ

– 2047నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ

-2047నాటికి దేశ జీడీపీలో రాష్ట్ర వాటా 10 శాతం

-నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, మహిళా సాధికారత, పర్యావరణ సుస్థిరత సాధించడం.

-మెరుగైన జీవన ప్రమాణాలు, నెట్ జీరో రోడ్‌ మ్యాప్

-రేడియల్ రోడ్లతో మౌలిక వసతుల భారీ అప్‌గ్రేడ్

-డైనమిక్ గ్రోత్ ఇంజిన్‌గా తెలంగాణ అభివృద్ధి

-చైనా ప్లస్ వన్ వ్యూహంతో తయారీ రంగంలో భారీ అవకాశాలు

-ఎలక్ట్రానిక్స్, ఫార్మా, బయోటెక్ కోసం ప్రత్యేక జోన్లు

-యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు

3 రీజియన్స్ కాన్సెప్ట్‌

కోర్ అర్బన్, పెరి అర్బన్, రూరల్ రీజియన్లుగా విభజించింది. ORR, RRR మధ్య భారీ పారిశ్రామిక గ్రోత్ కారిడార్లను ఏర్పాటు చేయనుంది. ఇక సేవలు, టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్‌గా కోర్ అర్బన్‌ రీజియన్‌ను తయారు చేయనుంది. ఇక పరిశ్రమలు, తయారీ రంగం హబ్‌గా పెరి అర్బన్ రీజియన్‌ను తీర్చిదిద్దనుండగా.. రూరల్ రీజియన్‌లో ఆగ్రో ప్రాసెసింగ్ పరిశ్రమలను ప్రోత్సాహించనుంది. 90 బిలియన్ డాలర్ల నుంచి 600 బిలియన్ డాలర్లకు నగర జీడీపీని పెంచుతామంటోంది ప్రభుత్వం. ట్రాఫిక్, నీటి కొరత, వరదలు, పర్యావరణ సవాళ్లకు శాశ్వత పరిష్కారాలు చూపిస్తామంటోంది. ప్రపంచ స్థాయి పెట్టుబడుల్లో ప్రధాన వాటా సాధించే ప్రణాళికలు సిద్దం చేసింది. ఇక ఫ్యూచర్‌ సిటీ, మూసీ పునరుజ్జీవం, డ్రై పోర్ట్‌, గ్రీన్‌ఫీల్డ్‌ హైవే, RRR, రింగురైలు, బుల్లెట్ రైలు వంటి వాటిని విజన్ డాక్యుమెంట్‌లో పొందుపర్చారు.