Kite Manja: గొంతులు తెగుతున్నాయ్, ప్రాణాలు తీస్తున్నాయ్! లోకల్ మాంజాలూ డేంజరే..

పీకలు కోస్తున్నావ్, ఉసురు తీస్తున్నావ్.. అంతా నువ్వే చేశావ్ అంటూ అందరూ ఆ చైనీస్ మాంజానే కొరకొరా చూస్తున్నారు. నిజానికి, మన మాంజాలు కూడా మామూలుగా లేవిప్పుడు. దారం కాని దారంతో తయారు చేస్తూ, చైనీస్ మాంజాస్‌కు దీటుగా అమ్ముడౌతున్న లోకల్ మాంజాలూ ప్రాణాలు తీస్తున్నాయ్. వీటి అంతు తేల్చాల్సిన బాధ్యత కూడా పోలీసులపై లేదంటారా?

Kite Manja: గొంతులు తెగుతున్నాయ్, ప్రాణాలు తీస్తున్నాయ్! లోకల్ మాంజాలూ డేంజరే..
Manja Incidents

Updated on: Jan 12, 2026 | 9:43 PM

గచ్చిబౌలిలో చైతన్య… బైక్‌పై వెళ్తుంటే, మాంజా చుట్టుకుంది, చెయ్యి కోసుకోపోయింది. ఉప్పల్ మెట్రో స్టేషన్ దగ్గర సాయివర్థన్‌రెడ్డి… మాంజా గొంతుకు బిగుసుకుని మృత్యువు అంచుకు తీసుకెళ్లింది. కొండాపూర్‌లో 33 ఏళ్ల సూర్యతేజ.. చైనా మంజా తగిలి భుజం నుంచి ఛాతీ దాకా రక్తస్రావమై ఆస్పత్రిపాలయ్యాడు.

చిలుకా, నెమలీ, మైనా అని మనం ముద్దుపేర్లు పెట్టుకుని ఆకాశంలో ఎగరేసే గాలిపటాలకు ఆధారం దారమేగా? ఆ దారపు ఉండల్నే మాంజాలంటాం. కానీ, ఇవాళారేపూ మనం వాడే పాపులర్ మాంజాలన్నీ మేడిన్ చైనా..!ఎందుకంటే ఇవి మహా పదునైనవి, చచ్చినా తెగవు. చుట్టుకుంటే మన దుంపలే తెగుతాయ్. ఎగరేసినవాళ్లు సేఫే. దారిన పోయే దానయ్యలే బలి. ఔను, చైనీస్ మాంజాతో మృత్యుఘంటికలు మోగడం మొదలైంది. ఈ నాలుగు రోజులూ బైటికెళ్లాలంటేనే భయపడిపోతున్నారు జనం. ఎటునుంచి ఏ మాంజా వచ్చి మెడకు చుట్టుకుంటుందో అని బెంబేలు.

పండక్కి ముందే ప్రమాదాల సంఖ్య పెరగడంతో చైనీస్ మాంజాతో ఖాకీలు అప్రమత్తమయ్యారు. స్పెషల్ డ్రైవ్‌తో సిటీ అంతటా జల్లెడ పడుతున్నారు. కేసులు పెట్టి దుకాణాల్ని సీజ్ చేస్తున్నారు. గత నాలుగు రోజుల్లోనే 43 లక్షల విలువైన బాబిన్లు స్వాధీనమయ్యాయి. 29 కేసులు నమోదు చేసి.. 57 మందిని అరెస్ట్ చేశారు. కానీ.. పోలీసులు ఉక్కుపాదం మోపుతోంది చైనీస్ మాంజాల మీద మాత్రమే. ఇవన్నీ చైనాలో తయారై ఇక్కడికి దిగొచ్చిన మాంజాలే. చైనీస్ మాంజాలు అమ్మినా నేరమే, కొన్నా నేరమే అని హెచ్చరిస్తున్నారు సీపీ సజ్జనార్. మరి, ఇక్కడే తయారయ్యే చైనీస్ మాంజాల సంగతేంటి? వాటికి చెక్ పెట్టేదెవ్వరు?

తయారయ్యేది చైనాలోనా, కొరియాలోనా అని కాదు, ఆ మాంజా క్యారెక్టరే ముఖ్యం. అది తయారు చేసే విధానం, అది ఎందుకంత పదునుగా ఉంటుంది, దాంతో వచ్చే ముప్పు ఏంటి…? ఇదేగా ఇంపార్టెంట్. నిజానికి, చైనీస్ మాంజానే కాదు, నార్మల్ మాంజా కూడా డేంజరే. లోకల్ మేడ్ మాంజాల్లో కూడా గొంతును కోసేంత పదును ఉంటోంది. ఎందుకంటే, చైనీస్ మాంజా తయారీ ఫార్ములాను, అందులో వాడే కంపొనెంట్లను తెలుసుకుని అదే కంపోజిషన్‌తో మనోళ్లు కూడా మాంజాల్ని విచ్చలవిడిగా తయారు చేస్తున్నారు. చైనీస్ మాంజాలకు దీటుగా అమ్మకాలూ షురూ చేస్తున్నారు.

గాలిపటాల్ని ఎగరెయ్యడానికి వాడే మాంజాలు కామన్‌గా కాటర్ దారంతోనే తయారౌతాయ్. కానీ, అవతలి పతంగుని కొట్టెయ్యాలన్నా, మన పతంగు బలంగా నిలబడాలన్నా మామూలు దారానికుండే పటుత్వం సరిపోదు. సరిగ్గా ఈ గ్యాప్‌లోనే ఎంట్రీ ఇచ్చింది చైనీస్ మాంజా. నైలాన్‌ సింథటిక్‌ ఫైబర్‌తో తయారు చేయడం, గాజుపొడి- లోహపు చూర్ణం పూత ఉండటం… ఇదీ చైనా మాంజాల స్పెషాలిటీ. ఇందుకే అవి అంత పదునుగా, అంత డేంజరస్‌గా మారుతున్నాయి. ప్రమాదకరమైతే మాకేంటి, సేల్సే మాకు ముఖ్యం అనుకుని చైనీస్ ఫార్ములాతోనే లోకల్‌గాళ్లు కూడా మాంజాల తయారీ షురూ చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే, చైనీస్ మాంజాల కంటే చైనా ఫార్ములాతో తయారయ్యే లోకల్ మేడ్ మాంజాలే మార్కెట్లో ఎక్కువగా చెలామణీలో ఉన్నాయ్..!

గత సంవత్సరం లంగర్‌హౌజ్ ఏరియాలో ఓ ఆర్మీ జవాన్‌ ప్రాణం తీసింది. అంతకుముందు, ఎల్బీనగర్ ఏరియాలో ఓ చిన్నారిని కూడా బలితీసుకుంది. ఇవన్నీ చైనా మాంజాలే కాకపోవచ్చు. లోకల్ మాంజాలైనా అయ్యుండొచ్చు. సో, కేవలం కాటన్ థ్రెడ్‌తో తయారయ్యే మాంజాలే సేఫ్, మిగతా ఏ మెటీరియల్‌తో చేసిన మాంజాలైనా డేంజరస్. పర్యావరణానికి, పక్షులకు, మనుషుల ప్రాణాలకు ముప్పు కలిగించే ఇటువంటి ఏ మాంజాల్నయినా దూరంగా పెట్టాల్సిందేనా?