Hyderabad Old City Hospital: హైదరాబాద్ పాతబస్తీ చాదర్ ఘాట్‌లో దారుణం జరిగింది. ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో డెలివరీ కోసం వచ్చిన మహిళకు హాస్పిటల్ సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. ఒకవైపు పురిటి నొప్పులతో బాధపడుతున్న పేషెంట్‌ను పట్టించుకోకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. హాస్పిటల్‌ని ఫైవ్ స్టార్ ఫంక్షనల్ హాల్‌గా మార్చేసి డీజే పెట్టి బాణాసంచా కాలుస్తూ.. హాస్పిటల్ సిబ్బంది నానా హంగామా చేశారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో శిశువు మరణించింది. లోబీపీతో వచ్చిన గర్భిణీని అడ్మిట్ చేసుకొన్న సిబ్బంది.. బీపీ నార్మల్ చేశారు వైద్యులు. ఆ తర్వాత బాధితురాలిని ఆస్పత్రిలో పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారు. పరిస్థితి విషమించడంతో పుట్టబోయే బిడ్డ కడుపులోనే చనిపోయింది. ఈ సమయంలో బాధితురాలు బెడ్‌పైనే నరకం అనుభవించింది. దీనంతటికి కారణం.. సిబ్బంది హాస్పిటల్ లో ఫంక్షన్ చేసుకోవడమేనని బాధితురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.
ప్రైవేట్ మెటర్నిటీ హాస్పిటల్‌ను ఫైవ్ స్టార్ ఫంక్షన్ హాల్‌గా మార్చి.. హాస్పిటల్ సిబ్బంది గానా బజానాతో బాణాసంచాలు కాల్చి పెద్ద హంగామా సృష్టించారని, దీంతో మహిళ ఆరోగ్యం క్షీణించి కడుపులోని బిడ్డ చనిపోయిందని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. చివరకు అతికష్టం మీద మహిళ ప్రాణాలను కాపాడారని పేర్కొన్నారు. ఈ ఘటన అనంతరం ఆస్పత్రి తీరుపై బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో బంధువులు చాదర్ ఘాట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో సిబ్బంది మొత్తం హాస్పిటల్ వదిలేసి పారిపోయారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..