దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రచారోద్యమంలో భాగం గా రాష్ట్రమంతటా 45 రోజులపాటు ఓటరు జాబితా వెరిఫికేషన్ నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ తెలిపారు. అక్టోబర్ 15 వరకు కొనసాగే ఈ కార్యక్రమంలో రెసిడెన్షియల్ సంక్షేమ సంఘాలకూ భాగస్వా మ్యం కల్పిస్తున్నట్టు తెలిపారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేశ్‌కుమార్, జాయింట్ సీఈవో రవికిరణ్, జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్లు హరిచందన, ముషారఫ్‌అలీతో కలిసి ఆయన ఆదివారం జీహెచ్‌ఎంసీ కార్యాలయం లో ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎలక్టోరల్ వెరిఫికేషన్ ప్రోగ్రాంపై రూపొందించిన పోస్టర్, బీఎల్వో హ్యాండ్‌బుక్‌ను లోకేశ్‌కుమార్‌తో కలిసి సీఈవో ఆవిష్కరించారు. దేశవ్యాప్తంగా 90 కోట్ల ఓటర్ల వెరిఫికేషన్ కార్యక్రమాన్ని పదిలక్షల కేంద్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించిందని రజత్‌కుమార్ తెలిపారు. హైదరాబాద్‌లో ఓటర్ జాబితాలను తప్పులు లేకుండా చేయడం సవాలుతో కూడుకొన్నదని, ఇందుకు తొలిసారిగా కాలనీ సంఘాల ప్రతినిధుల సహాయం తీసుకొంటున్నట్టు ఆయనవివరించారు.