
హైదరాబాద్‌లో మరో విచిత్రమైన ఘటన వెలుగుచూసింది. బిజినెస్‌లో నష్టపోయి, అప్పుల బారిన పడి.. వాటిని తీర్చేందుకు ఓ వ్యాపారి చైన్ స్నాచింగ్ మార్గాన్ని ఎంచుకున్నాడు. అంతేకాదు, యూట్యూబ్ వీడియోలు చూసి ఆ పని నేర్చుకున్నాడు. చివరికి పోలీసుల గాలికి చిక్కి జైలుని చేరాడు. చిక్కడపల్లి పోలీసులు నవంబర్ 8న ఈ కేసులో దంపతులను అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. బోరబండకు చెందిన గుడిపాటి బ్రహ్మయ్య వ్యాపారం చేసేవాడు. అందులో పెద్ద ఎత్తున నష్టాలు చవిచూశాడు. అంతేకాదు కూతురు పెళ్లి కోసం తీసుకున్న అప్పులు కూడా తలనొప్పిగా మారాయి. వాటిని తీర్చలేక, ఏం చేయాలో అర్థంకాక బంగారం ధరలు పెరగడంతో.. ఇదే సరైన మార్గమని చైన్ స్నాచింగ్ వైపు మళ్లాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్రహ్మయ్య యూట్యూబ్ వీడియోలు, న్యూస్ చానళ్లలో వచ్చిన చైన్ స్నాచింగ్ వార్తలు చూస్తూ.. ఆ దిశగా తన మైండ్ సెట్ మార్చుకున్నాడు. యూసఫ్‌గూడ, బోరబండ ప్రాంతాల్లో రెక్కీ చేశాడు. అక్టోబర్ 31న ఎర్రగడ్డ నుంచి మెట్రో ఎక్కి నారాయణగూడ వద్ద దిగాడు. సుల్తాన్‌బజార్ ప్రాంతంలో రెండు సార్లు ప్రయత్నించినా జనసమూహం ఎక్కువగా ఉండటంతో విఫలమయ్యాడు. అనంతరం ఓ మహిళను టార్గెట్ చేసి ఆమె ఇంటి వరకూ వెంబడించాడు. ఎలివేటర్ ఎదురుచూస్తున్న సమయంలో ఆమె గొలుసు లాక్కుని పరారయ్యాడు. ఇంటికి వెళ్లి దొంగిలించిన గొలుసును తన భార్యకు ఇచ్చి తనఖా పెట్టమని చెప్పాడు. నవంబర్ 1న ఆమె కూకట్‌పల్లి మణప్పురం ఫైనాన్స్ వద్ద ఒక చైన్ రూ.1.13 లక్షలకు తాకట్టు పెట్టారు. ఆ డబ్బుతో అప్పు కొంత తీర్చుకున్నారు.
అయితే చిక్కడపల్లి పోలీసులు ఆధారాల మేరకు శనివారం అశోక్‌నగర్‌లోని సహారా బేకరీ దగ్గర బ్రహ్మయ్యను పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 4.6 గ్రాముల ముత్యాలతో కూడిన విరిగిన గొలుసు, 14.354 గ్రాముల తాకట్టు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతని భార్యను కూడా అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.