MLA Danam Nagender: కేసీఆర్‌ సభ సక్సెస్.. ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు!

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ నెల 27న బీఆర్ఎస్( భారత రాష్ట్ర సమితి) నిర్వహించబోయే రజతోత్సవ సభ సక్సెస్ కాబోతోందని..కేసీఆర్‌ను చూసేందుకు జనాలు ఆశగా ఉన్నారని..కేసీఆర్‌ సభకు భారీగా జనం రావొచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే దానం నాగేందర్.

MLA Danam Nagender: కేసీఆర్‌ సభ సక్సెస్.. ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు!
Mla Danam Nagender

Updated on: Apr 24, 2025 | 10:34 PM

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ నెల 27న బీఆర్ఎస్( భారత రాష్ట్ర సమితి) నిర్వహించబోయే రజతోత్సవ సభ సక్సెస్ కాబోతోందని..కేసీఆర్‌ను చూసేందుకు జనాలు ఆశగా ఉన్నారని..
కేసీఆర్‌ సభకు భారీగా జనం రావొచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే దానం నాగేందర్. అదే కాకుండా ఐఏఎస్ స్మితా సభర్వాల్‌కూ ఆయన మద్దతు పలికారు. కంచ గచ్చిబౌలి విషయంలో స్మితా సభర్వాల్ చేసిన పోస్టులో తేడా ఏమీ లేదన్నారు. ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆమె పోస్టు చేయలేదని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్‌లో చేరిన దానం కొన్ని రోజులుగా అధికార పార్టీకి అంటీ అంటనట్టు ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆయన మళ్లీ బీఆర్ఎస్‌లోకి తిరిగి వెళ్తారా అనే టాక్‌ నడుస్తోంది.

అయితే బీఆర్ఎస్ తరపున ఖైరతాబాద్ నుంచి గెలిచిన దానం నాగేందర్ తర్వాత కాంగ్రెస్ లోకి చేరారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. అయితే పార్టీలో చేరే ముందు కాంగ్రెస్‌ తనకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో.. ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. ఈ మధ్య జరిగే పార్టీ సహా ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా ఆయన ఎక్కువగా కనిపించింది లేదు. దీంతో దానం పార్టీ వీడే ఆలోచనలో ఏమైనా ఉన్నారా.. అందుకే ఇలా మాట్లాడారా అనే టాక్‌ కూడా వినిపిస్తోంది. సామాన్యంగా అధికార పార్టీని వీడి మరో పార్టీకి వెళ్లాలని ఎవరూ అనుకోరు. కానీ పార్టీలో తనకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకపోతేనో, ఈ పార్టీలో ఉన్న ఏం లాభం లేదు అనిపిస్తే మాత్రం పార్టీ మారే అవకాశాలు ఉంటాయి. అయితే అతను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నా కూడా పార్టీ పెద్దగా పట్టించుకోవట్లేదని.. ఈ విషయంలో చూసి చూడనట్టు వ్వవహరిస్తోందనే రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ఈ నేపథ్యంలో దానం చేసిన వ్యాఖ్యలు వింటే ఆయన కాంగ్రెస్‌ పార్టీకి హ్యాండిస్తారేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి. కాంగ్రెస్‌లో ఉంటూ కేసీఆర్‌కు మద్దతుగా మాట్లాడడంతో తాను మళ్లీ బీఆర్ఎస్‌లోకి వెళ్లాలనుకుంటున్నారేమో అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే అలా తాను పార్టీ మారి మళ్లీ బీఆర్ఎస్‌ వెళ్తే..అక్కడ కూడా ఇలాంటి పరిస్థితే నెలకొనే అవకాశం కనిపిస్తోంది. ఇన్‌కేస్‌ దానం పార్టీ మారి మళ్లీ బీఆర్ఎస్‌లో చేరితే ఆయనకు ముందు ఉన్న ప్రాధాన్యత ఇప్పుడు దక్కకపోవచ్చు అని తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…