BJP: మిషన్‌ గోషామహల్.. హ్యాట్రిక్ స్థానంపై బీజేపీ ఫోకస్.. ఆ వ్యూహం అందుకేనా..

"మిషన్‌ గోషా మహల్.." ఇప్పుడు దీనిపైనే ఫోకస్‌ పెట్టింది తెలంగాణ కమలం. అక్కడ పాతుకుపోయానని చెబుతున్న రాజాసింగ్‌కు..సరైన వ్యూహంతో చెక్‌పెట్టాలని భావిస్తోంది. గోషా మహల్‌లో ఉన్నది రాజాసింగ్ బలం కాదు బీజేపీ బలమంటున్న ఆ పార్టీ.. అందువల్లే హ్యాట్రిక్‌ విజయం సాధ్యమయిందని చెబుతోంది.

BJP: మిషన్‌ గోషామహల్.. హ్యాట్రిక్ స్థానంపై బీజేపీ ఫోకస్.. ఆ వ్యూహం అందుకేనా..
Telangana Bjp

Updated on: Jul 13, 2025 | 8:37 AM

గ్రేటర్‌ హైదరాబాద్‌లో బీజేపీకి పట్టున్న నియోజకవర్గాల్లో గోషామహల్‌ ఒకటి. 2014, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్‌ స్థానంలో హ్యాట్రిక్‌ విజయాలు నమోదు చేసింది ఆ పార్టీ. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గోషా మహల్‌ స్థానం ఒకటే బీజేపీ పరువు నిలబెట్టింది. అలాంటి స్థానంపై రాజాసింగ్‌ రాజీనామాతో పట్టు కోల్పోకూడదని భావిస్తోంది కమలం పార్టీ. అందుకే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. రాజకీయ వ్యూహంలో భాగంగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అభినందన సభను నేతలు గోషామహల్‌లో ఏర్పాటు చేశారు.

ఎంఐఎంకు కంచుకోటలాంటి పాతబస్తీలో తన హిందుత్వ అజెండాతో సై అంటే సై అంటూ రాజకీయం నడిపించారు రాజాసింగ్‌.. దీంతో గత హైదరాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో గోషా మహాల్‌ పరిధిలోని అన్ని కార్పొరేట్‌ స్థానాలను కైవసం చేసుకుంది భారతీయ జనతా పార్టీ. వచ్చే ఎన్నికల్లో కూడా అదే ఉత్సాహంతో పనిచేసి పాతబస్తీలో తన పట్టును నిలుపుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. అదే లక్ష్యాన్ని రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు పార్టీ శ్రేణుల ముందు ఉంచారు.

సిట్టింగ్‌ స్థానంపై పట్టు నిలుపుకునే ప్రయత్నం..

ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్‌లో బీజేపీకి బలమైన నేతలతో పాటు క్యాడర్ ఉంది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో పాటు ఎంపీ లక్ష్మణ్‌, ప్రస్తుత రాష్ట్ర చీఫ్‌ రామ్‌చందర్‌రావు వంటి లీడర్లు భాగ్యనగరం నుంచే ప్రాతినిద్యం వహిస్తున్నారు. గ్రేటర్‌లో ఆ పార్టీ 40 మందికి పైగా కార్పొరేటర్లు ఉన్నారు. పాతబస్తీలో ఎంఐఎం తర్వాత రెండో స్థానంలో తన ఉనికిని చాటుకుంటోంది బీజేపీ. అందుకే అక్కడ బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలని భావిస్తోంది. అక్కడ ఎంఐఎం పార్టీని ఢీకొడితే గ్రేటర్‌లో మంచి పట్టు వస్తుందని లెక్కలు వేసుకుంటోంది.

అలాగే గోషామహాల్ బీజేపీకి సిట్టింగ్ స్థానం కావడంతో ఆ సీటును ఎలాగైనా నిలబెట్టుకోవాలని భావిస్తోంది. అందుకే పక్కాగా వ్యూహాలు రచిస్తున్నారు. మరి గోషామహాల్‌లో ఓ వైపు రాజాసింగ్‌ను మరోవైపు ఎంఐఎంను ఎదుర్కొనే ఆ నేత ఎవరో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..