Australia Parrot Missing: పెంపుడు జంతువులు, పక్షులకు ఈ మధ్యకాలంలో డిమాండ్ పెరిగింది. ప్రతి ఇంట్లో ఏదో ఒక పెంపుడు జంతువు దర్శనమిస్తోంది. చాలా కుటుంబాలు వాటిని ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నాయి. దేశీయంగానే కాదు.. విదేశాల నుంచి కూడా జంతువులు, పక్షులను లక్షల రూపాయలకు విక్రయించి తెచ్చుకుని మరి అల్లారు ముద్దుగా సాదుకుంటున్నారు. వాటికి ప్రతిరోజు ప్రత్యేక సపర్యలు చేస్తూ.. కుటుంబంలో సొంత మనిషిలా చూసుకుంటున్నారు. అంత ప్రేమతో పెంచుకుంటున్నటువంటి జంతువులు, పక్షులు ఒక్క క్షణం కనిపించకపోతే చాలు.. తల్లడిల్లి పోతున్నారు. వాటికోసం పోలీస్ స్టేషన్ గుమ్మం ఎక్కడానికి కూడా వెనకాడడం లేదు. అవి దొరికేంతవరకు వాటికోసం వెతుకుతూనే ఉంటున్నారు. అవసరమైతే.. తమ జంతువును వెతికి తెచ్చిన వారికి నజరానా కూడా ప్రకటిస్తున్నారు. ఇలా హైదరాబాద్ నగరంలో ఎక్కడో ఒక చోట తాము పెంచుకున్నటువంటి కుక్క లేదా పిల్లి పోయిందని ఆయా పోలీస్ స్టేషన్లను ఆశ్రయిస్తుండం ఆసక్తికరంగా మారింది. ఇటీవల తాము పెంచుకుంటున్న పిల్లి పోయిందంటూ ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. అనంతరం పిల్లి కోసం సెర్చింగ్ ఆపరేషన్ చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాలను జల్లెడపట్టారు. ఆ తర్వాత పెంపుడు పిల్లిని వెతికి యజమాని వద్దకు చేర్చారు.
అయితే, తాజాగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో తన చిలుక పోయింది అంటూ నరేంద్ర చారి అనే ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. ఆస్ట్రేలియా దేశంలోని అరుదైన జాతికి చెందిన గాలరాక్టో అనే చిలుకను 1,30,000 లకు విక్రయించాడు. ఈ క్రమంలో చిలుక పంజరం నుంచి ఎగిరిపోయింది. సెప్టెంబర్ 22న చిలుకకు మేత వేసేందుకు పంజరాన్ని ఓపెన్ చేయగా.. ఒక్కసారిగా అది దాని నుంచి ఎగిరిపోయింది. ఎంతకీ అది తిరిగి రాకపోవడంతో బాధిత వ్యక్తి నరేంద్రాచారి 24న జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చిలుక కోసం వెతికే పనిలో పడ్డారు.
ఈ క్రమంలో చిలుక ఫోటోను వివిధ షాపులలో చూపించారు. ఈ క్రమంలో అసలు గుట్టు బయటపడింది. ముందుగా ఎర్రగడ్డలో ఓ వ్యక్తి 30 వేలకు చిలుకను విక్రయించాడు. ఆ వ్యక్తి 50 వేలకు మరొక వ్యక్తి సయ్యద్ ముజుహిత్‌కి విక్రయించాడు. అతను దీనిని 70000 అమ్ముతానంటూ వాట్సప్ స్టేటస్‌లో పెట్టాడు. అది చూసిన పెట్ షాప్ నిర్వాహకులు ఎస్సైకి సమాచారం అందించడంతో 25న సయ్యద్ వద్ద నుంచి ఈ అరుదైన జాతి పక్షిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం చిలుకను నరేంద్ర చారికి అప్పగించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చినటువంటి ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. ఒక్కరోజులోనే ఈ చిలుకను యజమానికి అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. చివరకు చిలుక తన దగ్గరికి రావడంతో నరేంద్రా చారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..