ఉత్తరాదిలో పొగమంచు కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. చాలా మార్గాల్లో కొన్ని రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. మరికొన్ని రైళ్ల రాకపోకల సమయాల్లో మార్పలు చేసింది. దీని ప్రభావంతో ఉత్తరాది నుంచి దక్షిణాది రాష్ట్రాలకు నడిచే రైళ్ల రాకపోకల సమయాల్లో కూడా రైల్వే శాఖ అధికారులు మార్పులు చేశారు. ఇందులో భాగంగా జనవరి 23న (మంగళవారం) హైదరాబాద్ – న్యూఢిల్లీ తెలంగాణ ఎక్స్‌ప్రెస్ (రైలు నెం.12723) షెడ్యూల్‌లో కూడా రైల్వే అధికారులు మార్పలు చేశారు. సహజంగా ఈ రైలు హైదరాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 06.00 గంటలకు బయలుదేరుతుంది. అయితే మంగళవారంనాడు ఇది ఐదు గంటలు ఆలస్యంగా ఉదయం 11.00 గంటలకు బయలుదేరి వెళ్తుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. మారిన టైమ్‌ను పరిగణలోకి తీసుకుని ప్రయాణీకులు తమ ట్రావెల్‌ను ప్లాన్ చేసుకోవాలి. ఆ మేరకు ఇతర రైల్వే స్టేషన్లలో తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రాకపోకల సమయంలో కూడా మార్పులు జరగనుంది.
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ దక్షిణ మధ్య రైల్వే నిర్వహిస్తున్న సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్. ఈ రైలు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి 1,677 కిలో మీటర్ల దూరం ట్రావెల్ చేస్తుంది. ఈ రైలు గంటకు 65 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.
ఇదిలా ఉండగా జ్యోతిర్లింగ దివ్య దక్షిణ్ యాత్ర భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ జనవరి 23న ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫాం నెం.10 నుంచి బయలుదేరి వెళ్లనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.