AP – TG: పరిష్కారం దిశగా ఏపీ, తెలంగాణ నీటి వివాదాలు..! చంద్రబాబు, రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

తెలుగు రాష్ట్రాల మధ్య నీటి మంటలు తగ్గుముఖం పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇతర నేతల మాటలు ఎలా ఉన్నా.. ఈ విషయంలో ఇరు రాష్ట్రాల సీఎంలు సామరస్యపూర్వక పరిష్కారమే బెటరని కామెంట్ చేయడం కొత్త సరికొత్త చర్చకు దారి తీస్తోంది. నేతలు.. చర్చలకు సిద్ధమని సంకేతాలివ్వడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

AP - TG: పరిష్కారం దిశగా ఏపీ, తెలంగాణ నీటి వివాదాలు..! చంద్రబాబు, రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
Cms Chandrababu Naidu and Revanth Reddy

Updated on: Jan 09, 2026 | 9:08 PM

తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల వ్యవహారంలో నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇరు రాష్ట్రాల నేతలు ఈ అంశంలో తమ ప్రత్యర్థి పార్టీలతో పాటు పొరుగు రాష్ట్రంపై విమర్శలు గుప్పించడం సర్వసాధారణంగా మారింది. కృష్ణా జలాలు తెలంగాణకు రాసివ్వడానికి చంద్రబాబు ఎవరని ప్రశ్నించారు వైసీపీ నేత, మాజీమంత్రి పేర్ని నాని, పొరుగు రాష్ట్రాలతో గొడవలొద్దంటున్న చంద్రబాబు.. జగన్ ఐదేళ్లలో ఎవరితోనైనా గొడవపెట్టుకున్నారా అని ప్రశ్నించారు.

బీఆర్‌ఎస్‌కు నదీ జలాలపై చిత్తశుద్ధి లేదన్న తెలంగాణ మంత్రి ఉత్తమ్. తెలంగాణ హక్కుల విషయంలో రాజీపడేది లేదని మరోసారి స్పష్టం చేశారు. నీటి హక్కులో ఒక చుక్క వాటా వదలబోమన్నారు.

చర్చలకు సిద్ధం: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..

అయితే జలవివాదాల అంశంలో తెలుగు రాష్ట్రాల సీఎంల వైఖరి మారుతోంది. చర్చల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకునేందుకు సిద్ధమనే విధంగా ఇరువురు సీఎంలు సంకేతాలు ఇస్తున్నారు. పక్క రాష్ట్రాలతో నీళ్ల పంచాయితీ అవసరం లేదని.. నీళ్ల విషయంలో రాజకీయాలు చేయొద్దని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ అంశంలో పొరుగు రాష్ట్రాలతో చర్చలకు సిద్ధమంటూ సీఎం ప్రకటించారు.

గొడవలు కాదు.. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్న ఏపీ సీఎం చంద్రబాబు

మరోవైపు పోలవరం నుంచి నల్లమలసాగర్‌కు నీళ్లు తీసుకెళతామని మరోసారి స్పష్టం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు.. గొడవలతో ఎవరికీ ప్రయోజనం ఉండదని తెలిపారు. తనకు గొడవలు ముఖ్యం కాదని.. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని అన్నారు.

చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం అంటున్న సీఎంలు

మిగతా నేతల మాటలు ఎలా ఉన్నా.. ఏపీ, తెలంగాణ సీఎంలు నదీ జలాల అంశంలో గొడవలు లేకుండా చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని ఆకాంక్షించడం చర్చనీయాంశంగా మారుతోంది. దీంతో రాబోయే రోజుల్లో ఈ దిశగా అడుగులు పడే అవకాశాలు ఉండొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..