Hyderabad: దూకుడుమీదున్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌.. గతేడాదితో పోల్చితే..

ఇక 2023లో రెసిడెన్షియల్‌ విక్రయాలు 61,715 యూనిట్లుగా నమోదయ్యాయి. అదే 2022లో ఈ సంఖ్య 47,485 యూనిట్లుగా ఉంది. ఈ లెక్కన ఏడాదిలో 30 శాతం పెరుగుదల కనిపించింది. 2023లో జరిగిన మొత్తం రెసిడెన్షియల్‌ అమ్మకాల్లో 91 శాతం వాటాను ముంబయి, పుణే, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్‌ నగరాలే కావడం గమనార్హం. అలాగే 2023లో హైదరాబాద్‌లో సుమారు 76,345 కొత్త రెసిడెన్షియల్ యూనిట్స్‌...

Hyderabad: దూకుడుమీదున్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌.. గతేడాదితో పోల్చితే..
Hyderabad

Updated on: Dec 28, 2023 | 9:21 PM

హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ రంగం అనూహ్యంగా పుంజుకుంది. గతేడాదితో పోల్చితే 2023లో నగరంలో నివాస గృహాల ధరలు 24 శాతం పెరిగాయి. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్‌ సంస్థ ANAROCK విడుదల చేసిన గణంకాల్లో ఈ విషయం వెల్లడైంది. ఇటీవలి కాలంలో హైదరాబాద్‌లో నివాస గృహాల ధరలు ఇంతలా పెరగడం ఇదే ప్రథమం. 2022తో పోల్చితే.. చదరపు అడుగుకు రూ. 4,620 నుంచి రూ. 5,750కి పెరిగినట్లు గణంకాలు చెబుతున్నాయి.

ఇక 2023లో రెసిడెన్షియల్‌ విక్రయాలు 61,715 యూనిట్లుగా నమోదయ్యాయి. అదే 2022లో ఈ సంఖ్య 47,485 యూనిట్లుగా ఉంది. ఈ లెక్కన ఏడాదిలో 30 శాతం పెరుగుదల కనిపించింది. 2023లో జరిగిన మొత్తం రెసిడెన్షియల్‌ అమ్మకాల్లో 91 శాతం వాటాను ముంబయి, పుణే, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్‌ నగరాలే కావడం గమనార్హం. అలాగే 2023లో హైదరాబాద్‌లో సుమారు 76,345 కొత్త రెసిడెన్షియల్ యూనిట్స్‌ అందుబాటులోకి వచ్చాయని నివేదికలో వెల్లడైంది. గతేడాదితో పోల్చితే ఇది 12 శాతం అధికం కావడం విశేషం.

కొత్తగా అందుబాటులోకి వచ్చిన రెసిడెన్షియల్స్‌లో 82 శాతం రూ. 40 లక్షల నుంచి రూ. 2.5 కోట్ల రేంజ్‌లో ఉందని నివేదికలో వెల్లడైంది. 2023లో భారతీయ గృహ నిర్మాణ రంగం అద్భుతమైన పనితీరును కనబరించిందని ANAROCK గ్రూప్‌ ఛైర్మన్‌ అనూజ్‌ పూరి తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రపంచవ్యాప్తంగా ఎదురు గాలులు వీస్తున్నా, వడ్డీ రేట్లలో పెరుగుదల ఉన్నా 2023లో భారతీయ గృహ నిర్మాణ రంగం వృద్ధి సాధించడం గొప్ప విషయం’ అని చెప్పుకొచ్చారు.

ఇక 2024లో గృహనిర్మాణ రంగం ఎలా ఉంటుందన్న దానిపై నివేదికలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. వచ్చే ఏడాది దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో రెసిడెన్స్‌ ధరలు సగటును 8 నుంచి 10 శాతం పెరిగినా.. గృహ నిర్మాణ రంగంలో స్థిరమైన డిమాండ్‌ ఉంటుందని ANAROCK సంస్థ అంచనా వేసింది. ఇదిలా ఉంటే 2024 కూడా లగ్జరీ హౌసింగ్ డిమాండ్‌ పెరుగుతుందని నివేదిక అంచనా వేసింది.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..