
Tukkuguda Congress meeting: కాంగ్రెస్ పార్టీ విజయభేరి సభకు సర్వం సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు తుక్కుగూడ వేదికగా భారీ బహిరంగ సభను నిర్వహించబోతోంది. ఇందుకు పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే హాజరుకానున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీ వ్యూహాలకు పదును పెట్టే పనిలో పడింది. ఈ సభా వేదిక నుంచి 6 గ్యారెంటీ హామీలను ప్రకటించనున్నారు సోనియా గాంధీ. రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీతో కీలకమైన ప్రకటనలు చేయించటం ద్వారా.. బలమైన సందేశాన్ని ప్రజల్లోకి పంపాలని టీపీసీసీ భావిస్తోంది. ఇందులో భాగంగా తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే విషయానికి సంబంధించి ఐదు ప్రధాన హామీలను ప్రకటించనుంది. ఇప్పటికే పలు డిక్లరేషన్లను ప్రకటించిన కాంగ్రెస్.. విజయభేరి సభ వేదిక నుంచి ఎలాంటి ప్రకటనలు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ గ్యారంటీలలో ప్రధానంగా తక్కువ ధరకు గ్యాస్ సిలిండర్, రైతు రుణమాఫీ, కర్ణాటకలో మాదిరిగా మహిళలకు ఉచిత ప్రయాణం, గృహలక్ష్మితో పాటు ఉద్యోగాల భర్తీ, ఎస్సీ ఎస్టీ, బీసీ సబ్ ప్లాన్ వంటి అంశాలు ఉంటాయని పార్టీ వర్గాల మేరకు తెలుస్తోంది. విజయభేరి బహిరంగ సభకు భారీ ఎత్తున జనాన్ని సమీకరించేలా ప్లాన్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ప్రతి మండలం నుంచి జనాన్ని తరలించనుంది. ప్రధానంగా హైదరాబాద్ నగరానికి దగ్గరగా ఉన్న జిల్లాల నుంచి అధిక సంఖ్యలో జనాన్ని తరలించేలా కార్యాచరణను రూపొందించుకున్నారు.సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారీ జన సమీకరణను నిర్వహిస్తున్నారు.
విజయభేరి సభను పురస్కరించుకుని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శనివారం ఉదయం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చే ఆరు గ్యారంటీలను సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే ఈ సాయంత్రం బహిరంగ సభలో తెలియజేస్తారని టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పారు. అదేవిధంగా బోయిన్‌పల్లిలో ఉన్న రాజీవ్ గాంధీ ప్రాంగణంలోని పదిన్నర ఎకరాల స్థలంలో రాజీవ్ గాంధీ నాలెడ్జ్ అండ్ ట్రైనింగ్ సెంటర్‌కు సోనియా గాంధీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ నలుమూలల నుంచి అన్ని వర్గాల వారు లక్షలాదిగా తుక్కుగూడ సభాస్థలికి తరలిరావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
సీడబ్ల్యూసీ సమావేశాలు ఇక్కడ ఏర్పాటు చేయడం తెలంగాణకు ఎంతో కీలకమని రేవంత్ రెడ్డి అభిప్రాయప్డారు. తెలంగాణ కాంగ్రెస్ తరపున జాతీయ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్, ఎంఐఎం బీజేపీకి పరోక్ష మద్దతుదారులంటూ ఆరోపించారు. 2024 ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన విధానాలపై నిన్న సీడబ్ల్యూసీ సమావేశంలో చర్చించామన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఇవాళ జరిగే సమావేశంలో చర్చిస్తామన్నారు. సాయంత్రం జరిగే విజయభేరిలో సోనియాగాంధీ గ్యారంటీలను ప్రకటిస్తారని.. బోయిన్ పల్లి రాజీవ్ గాంధీ నాలెడ్జ్ సెంటర్‌కు సభలోనే శంఖుస్థాపన చేస్తారన్నారు.
తెలంగాణ ఇస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్టే.. ఇవాళ విజయభేరిలో ఇవ్వబోయే గ్యారంటీలను కాంగ్రెస్ అమలు చేస్తుందని రేవంత్ తెలిపారు. అధికారంలోకి వచ్చిన మొదటి వంద రోజుల్లో పథకాలు అన్నీ అమలు చేసేలా గ్యారెంటీ ఇవ్వబోతున్నామన్నారు. సాయంత్రం తుక్కుగూడలో జరిగే విజయభేరి సభకు లక్షలాదిగా తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. అయితే, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి మాట్లాడే వాటికి తాము స్పందించమంటూ విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..