హైదరాబాద్, డిసెంబర్ 15: నేటి కాలంలో పిల్లలు, యువత ఫోన్‌లకు అడిక్ట్ అయిపోతున్నారు. కాసేపు కూడా ఫోన్ వదలలేని స్థితికి వస్తున్నారు. నిద్రలేచింది మొదలు.. రాత్రి నిద్రకు ఉపక్రమించే వరకూ చేతిలో ఫోన్ ఉండాల్సిందే. పొరబాటున ఎవరైనా ఫోన్ లాక్కుంటే వారిపై దాడికి తెగబడటం.. లేదంటే తమను తామే గాయపరచుకోవడం, ఆత్మహత్య చేసుకోవడం వంటి పనులు చేస్తున్నారు. ఇటువంటి ఘటనలు ఇటీవల కాలంలో భారీగా పెరిగిపోతున్నాయి. ఆ మధ్య కాలేజీలో ఓ టీచర్ విద్యార్ధి వద్ద ఫోన్ లాక్కున్నందుకు ఏకంగా తరగతి గదికి కత్తి తీసుకొచ్చి.. టీచర్‌ను పొడిచాడు. మరో ఘటనలో ఫోన్ చూడొద్దని తల్లి మందలించిందని ఓ యువతి ఇంట్లోకెళ్లి ఫ్యాన్కు ఉరి పెట్టుకుంది. దేశ నలుమూలలగా ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్‌లోనూ ఈ తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే..
ఫోన్ విషయంలో అన్నదమ్ముళ్లు గొడవపడ్డారు. ఇద్దరినీ తండ్రి మందలించడంతో మనస్థాపం చెందిన తమ్ముడు యాసిడ్ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధి జమ్మిగడ్డలో చోటుచేసుకున్నది. ఎస్‌హెచ్‌వో సైదయ్య తెలిపిన ప్రకారం.. హైదరాబాద్‌లోని జమ్మిగడ్డలోని బీజేనగర్ కాలనీలో వెంకటేశ్ కుటుంబంతో సహా కాపురం ఉంటున్నాడు. ఇతడికి భార్య, ముగ్గురు కుమారు ఉన్నారు. కుమారులు సాయికృష్ణ, సాయికుమార్, రాకేశ్ స్థానికంగా చదువుకుంటున్నారు.
అయితే డిసెంబర్ 14వ తేదీన ఫోన్ విషయంలో కుమారులు సాయికృష్ణ, సాయి కుమార్ గొడవపడుతుండటంతో వద్దని తండ్రి వారించాడు. ఈ క్రమంలో పెద్దవాడు అయిన సాయికృష్ణను తండ్రి మందలించి, ఏదో ఒక పని చేసుకుని బతకాలని, ఫోన్ చూస్తూ కాలక్షేపం చయవద్దని చెప్పడంతో సాయికృష్ణ తీవ్రంగా మనస్థాపం చెందాడు. అనంతరం అదేరోజు రాత్రి 9 గంటల సమయంలో సాయికృష్ణ(18) యాసిడ్‌ని తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు సాయికృష్ణను సమీపంలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం గాంధీ దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.