Covid Vaccine: కరోనా మహమ్మారి పీచమణిచే వ్యాక్సిన్ మార్కెట్‌లోకి వచ్చినా.. ఫలితం లేకుండా పోతోంది. కరోనా కంటే ఎక్కువగా.. ఆ వ్యాక్సిన్‌ను చూసే ప్రజలంతా భయపడుతున్నారు. వ్యాక్సిన్ వేసుకోవడానికి జంకుతున్నారు. ఫలితంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదిస్తోంది. దీనంతటికీ కారణం వ్యాక్సిన్ సమర్థతపై ఉన్న అనుమానాలే. ఈ అనుమానాల వల్లే ప్రజలెవరూ వ్యాక్సిన్ వేసుకోవడానికి ముందుకు రావడం లేదు. అయితే, ఆ అనుమానాలు, అపోహలను పటాపంచలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన 100 ఏళ్ల వృద్ధుడు వ్యాక్సిన్ వేసుకునేందుకు ముందుకు వచ్చాడు. అంతేకాదు.. వ్యాక్సిన్ వేసుకుని అందరికీ ఆదర్శంగా నిలిచాడు.
పూర్తి వివరాల్లోకెళితే.. నగరానికి చెందిన జైదేవ్ చౌదరి(100) తాజాగా కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నాడు. అంతేకాదు.. మిగతా వారూ వ్యాక్సిన్ తీసుకోవాలని పిలుపునిచ్చాడు. వ్యాక్సినేషన్ తరువాత మాట్లాడిన జైదేవ్.. 60 పైబడిన వారంతా తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని కోరాడు. 45 నుంచి 59 సంవత్సరాల వారు వ్యాక్సిన్ తీసుకోవడం అవసరం అన్నారు. ఈ వయసుల వారిలో రోగనిరోధక వ్యవస్థలు బలహీనపడుతుంటాయని, ఫలితంగా కరోనా వంటి అంటు వ్యాధులతో పోరాడటం చాలా కష్టం అన్నారు. అందుకే వ్యాక్సిన్ తీసుకుని ధైర్యంగా ఉండాలని సూచించారు. వ్యాక్సిన్‌పై అపోహలు సరికావన్నారు.
‘‘కరోనా మహమ్మారి కారణంగా, హైదరాబాద్‌లోని సీనియర్ సిటిజన్లు ఎక్కువ కాలం ఇంటికే పరిమితం అవ్వాల్సి వచ్చింది. ఇది వారి మానసిక మరియు శారీరక ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపింది. నేను నా పాత దినచర్యకు తిరిగి వెళ్లి చురుకైన సామాజిక జీవితాన్ని గడపడం కోసం ఈ రోజు టీకాలు వేయించుకోవడానికి వచ్చాను. కరోనా మహమ్మారిని అంతం చేసే ఏకైక మార్గంగా వ్యాక్సినే అని నేను భావిస్తున్నాను. తమ సొంత ప్రయోజనంలా భావించకుండా సమాజం కోసం ప్రజలు ముందుకు వచ్చి టీకాలు వేయించుకోవాలి’’ అని చౌదరి వ్యాఖ్యానించాడు.
ఇక వ్యాక్సినేషన్‌పై మెడికోవర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి. అనిల్ కృష్ణ మాట్లాడారు. వ్యాక్సిన్ ఇచ్చిన తరువాత జైదేవ్ చౌదరిలో ఎలాంటి దుష్ఫలితాలు చోటు చేసుకోలేదన్నారు. ‘‘టీకాలు, టీకా ప్రక్రియ గురించి సందేహాలు ఉన్న ప్రజలందరికీ జైదేవ్ చౌదరి ఆదర్శనంగా నిలిచారు. ప్రస్తుతం రెండో దశ వ్యాక్సినేషన్ కార్యక్రమం విస్తృతంగా జరుగుతోంది. ఇక మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కేసులు పెరగడంతో వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఈ వ్యాక్సిన్ 100 ఏళ్ల వ్యక్తికి సురక్షితం అయినప్పుడు.. మిగతా అందరికి కూడా సురక్షితమే అవుతుంది.’’ అని చెప్పుకొచ్చారు.
Also read:
David warner : డేవిడ్ వార్నర్ ఈసారి తలైవాగా మారాడు.. సూపర్ స్టార్ రజనీకాంత్‌ని వదల్లేదుగా..
తమిళనాట రాజుకున్న ఎన్నికల వేడి.. పోటా పోటీ ప్రచారాలతో నేతల జోరు.. మహిళల ఓట్లపైనే కమల్‌హాసన్ గురి