సండే వచ్చిందంటే ఇంట్లో చికెన్ ఉండాల్సిందే లేదంటే ఏదో వెలితి. వారంలో ఒక్కరోజైనా ముక్క ఉండకపోతే ఏదో లోటుగా ఉంటుంది. చికెన్ బిర్యానీ అని, చికెన్ కర్రీ అని ఇలా రకరకాలుగా కోడిని లాగించేసే నాన్ వెజ్ ప్రియులకు ప్రస్తుతం చికెన్ ధరలు చుక్కలు చూపిస్తోంది. వేసవి ముగింపు దశకు చేరుకున్న తరుణంలోనూ ధరలు పెరుగుతుండడం షాక్‌కి గురి చేస్తోంది. కేవలం రెండు వారాల్లోనే ఏకంగా రూ. 100 ధర పెరగడంతో చికెన్ లవర్స్ ఉసూరుమంటున్నారు.
హైదరాబాద్ పరిధిలో ప్రస్తుతం లైవ్ కోడి ధర రూ. 195కాగా, విత్ స్కిన్ రూ. 290గా ఉంది. ఇక స్కిన్‌లెస్ చికెన్ ధర విషయానికొస్తే రూ. 320కి పెరిగింది. ఇదిలా ఉంటే ఏప్రిల్ నెలలో కిలో చికెన్ ధర రూ. 150 ఉండగా ప్రస్తుతం ఏకంగా రూ. 320కి చేరింది. రెండు నెలల్లో ఏకంగా రెట్టింపు కావడం గమనార్హం. రవాణా ఛార్జీలు, కోళ్లదాణా ఖర్చులు పెరగడంతో ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. అయితే వర్షాలు ప్రారంభమైన తర్వాత చికెన్ ధరలు తగ్గే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..