
హైదరాబాద్ మహానగరం సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాపూనగర్‌లో చోటుచేసుకున్న ఒక మిస్టరీ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి దేవేందర్ తన భార్య, కుమారుడితో కలిసి గత 24 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న ఇంట్లో ఈ వింత ప్రమాదం సంభవించింది. దీంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టరు.
ఇంటి వంటగది ప్రాంతంలో ఒక్కసారిగా వినబడిన భారీ శబ్దానికి ఇల్లు తీవ్రంగా ధ్వంసమైంది. పేలుడు ధాటికి ఇంటి గోడలు పగులిచ్చాయి, తలుపులు, కిటికీల అద్దాలు పూర్తిగా ముక్కలయ్యాయి. ప్రమాద సమయంలో కుటుంబ సభ్యులంతా ఇంట్లోనే ఉన్నప్పటికీ, అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
అన్నీ బాగున్నాయి.. మరి కారణమేంటి?
సాధారణంగా ఇలాంటి ప్రమాదాలు గ్యాస్ సిలిండర్ లేదా ఫ్రిజ్ పేలడం వల్ల జరుగుతుంటాయి. కానీ, ఈ ఘటన తర్వాత ఇంట్లోని గ్యాస్ స్టౌ, మూడు గ్యాస్ సిలిండర్లు, ఫ్రిజ్, గీజర్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను పరిశీలించగా అవన్నీ సురక్షితంగానే ఉన్నాయి. కనీసం ఇంట్లో అగ్నిప్రమాదం జరిగిన ఆనవాళ్లు మంటలు, మసి కూడా లేకపోవడం అధికారులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
రంగంలోకి పోలీసులు, హైడ్రా సిబ్బంది
సమాచారం అందుకున్న వెంటనే సరూర్‌నగర్ పోలీసులు, హైడ్రా (HYDRAA) సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అసలు ఆ భారీ శబ్దానికి, ఇంటి ధ్వంసానికి గల కారణమేంటన్నది ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. భూగర్భంలో ఏవైనా మార్పులు జరిగాయా? లేక మరేదైనా రసాయన చర్య కారణమా? అనే కోణంలో నిపుణుల సహాయంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ మిస్టరీ ఘటన స్థానిక ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…