Vijaya Reddy to join Congress: అధికార పార్టీ టీఆర్‌ఎస్‌కు గ్రేటర్ హైదరాబాద్‌లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఖైరతాబాద్ టీఆర్ఎస్ (TRS) కార్పొరేటర్ విజయా రెడ్డి కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు. ఈ నెల 23న అధికారికంగా కాంగ్రెస్‌లో చేరనున్నట్లు దివంగత నేత పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి ప్రకటించారు. ఈ మేరకు విజయారెడ్డి శనివారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిసి మాట్లాడారు. తన నాన్న పీజేఆర్ సీఎల్పీ లీడర్‌గా పార్టీలో ఉండి.. పార్టీలోనే మరణించారని గుర్తు చేశారు. తన కుటుంబం ముందు నుంచి కాంగ్రెస్‌లోనే ఉందని చెప్పారు. పీజేఆర్ కూతురుగా టీఆర్ఎస్‌లో ఇమడలేకపోయానని ఆమె వివరించారు. అందరితో చర్చించిన తరువాతనే ఈ నిర్ణయం తీసుకున్నాని తెలిపారు. తాను పీజేఆర్ బాటలోనే నడుస్తానంటూ విజయారెడ్డి చెప్పారు. కాంగ్రెస్‌లో ఉంటేనే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. దేశానికి ప్రత్యామ్నాయం టీఆర్ఎస్ కాదని.. కాంగ్రెస్ వైపు అందరూ చూస్తున్నారన్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అని.. తన వంతు కృషి పార్టీకి చేస్తానని చెప్పారు. తాను పదవుల కోసం ఈ నిర్ణయం తీసుకోలేని.. తన తండ్రి బాటలో నడిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విజయా రెడ్డి వివరించారు.
టీఆర్ఎస్‌కు రాజీనామా..
ఈ మేరకు విజయా రెడ్డి టీఆర్ఎస్‌కు రాజీనామా చేస్తూ ప్రకటన విడుదల చేశారు. ‘‘తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత ప్రజల జీవితాలలో మార్పు కోసం టి.ఆర్.యస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలకు నా వంతు సహకారము అందించేందుకు 2015లో నేను పార్టీలో చేరాను. తెలంగాణ ప్రాంత సమస్యలపై అలుపెరుగని పోరాటము చేసిన పి జె ఆర్ కుమార్తె గా ఖైరతాబాద్ నియోజక వర్గంలో నాకు సరైన గుర్తింపు ఇస్తామని మీతో సహా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్ గారు స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాతనే పార్టీలో చేరిన విషయము మీకు గుర్తు ఉండే వుంటుంది. రెండు సార్లు అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసిన నన్ను 2016 ఎన్నికలలో కార్పోరేటర్ గా పోటీ చేయాలని ఆదేశించారు. నియోజక వర్గం స్థాయి నాయకురాలిగా ఉన్న నన్ను కార్పోరేటర్ ఎన్నికల లో పోటీ చేయవద్దని నా అభిమానులు, పి.జె.ఆర్ గారి అభిమానులు వారించారు. ఎన్నికల ముందు కూడా నాలక్ష్యం నియోజక వర్గంలో ప్రజలకు సేవ చేయడమే లక్ష్యమని, 2018 ఎన్నికలలో అవకాశం ఇస్తామని హామీ ఇస్తీన కార్పోరేటర్‌గా పోటీచేస్తానని చెప్పాను. పార్టీ అవసరం కోసం కార్పోరేటర్ గా పోటీ చేయాలని మీరు అదేశించడముతో నిబద్దత కలిగిన కార్యకర్తగా టీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం ఆ ఎన్నికలలో ఖైరతాబాద్ కార్పోరేటర్ గా పోటీ చేయడం తో పాటు ఘనవిజయం సాధించాను..
2018 అసెంబ్లీ ఎన్నికలలో చివరి నిముషము దాకా ఖైరతాబాద్ టికెట్ నాకే అని నమ్మించిన మీరు కాంగ్రెస్ నుంచి వచ్చిన దానం నాగేందర్ గారికి టికెట్ ఇచ్చారు. అయిన మీ మాట మీద నమ్మకంతో పార్టీలోనే కొన సాగడంతో పాటు పార్టీ అభ్యర్థి గెలుపుకు పని చేసాను. ఇటీవల జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో కూడా ఇదే విధమైన పరిస్థితి ఎదురైనా మీ మాట మీద నమ్మకంతో మరోసారి కార్పోరేటర్‌గా పోటీ చేసి గెలిచాను. నిరంతరం ప్రజలలో ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం కొట్లాడే నన్ను కేవలం ఒక డివిజన్ కే పరిమితం చేయడంతో పాటు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే అవకాశం ఇవ్వడం లేదు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పేదలకు ఇంటి నిర్మాణం కోసం రూపాయలు అయిదు లక్షల సహాయం గురించి ప్రజలు నిలదీస్తుంటే సమాధానం ఇవ్వలేక పోతున్నాము. ఇక దళితబందు పథకం ద్వారా కేవలం కొంతమందికి సహాయం అందిస్తూ మిగిలిన వారికి మొండిచెయ్యి చూపించడం తీవ్ర మన స్థాపాన్ని కలిగిస్తుంది. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో చేయించాల్సిన పనులకు నిధులు లేకపోవడంతో ఎక్కడికక్కడ పనులు నిలిచిపోయాయి. నియోజకవర్గం లో సమస్యలు పరిష్కారము కావడం లేదు. ప్రజల తరపున ప్రశ్నించేందుకు అవకాశం లేకుండా పోయింది. టిఆర్‌యస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్తితి లేకుండా పోయినది. బీజేపీతో లోపాయికారి ఒప్పందాలు ఉన్నవని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇలాంటి పరిస్తితిలో ప్రజలతరఫున నిలబడాల్సిన భాద్యత మాలాంటి నాయకులపై ఉంది. కాబట్టి నేను టి.ఆర్.ఎస్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను. ఇన్నాళ్ళు . పార్టీలో నాకు ఇచ్చిన అవకాశాలకు ధన్యవాదాలు.’’
కాగా.. పీజేఆర్ కూతురు విజయా రెడ్డి.. గ్రేటర్ హైదరాబాద్ లో టీఆర్ఎస్ ముఖ్యమైన లీడర్‌గా ఉన్నారు. అంతేకాకుండా గ్రేటర్‌లో మేయర్ పదవికి కూడా ఆమె పోటీ పడపమాకగ. ప్రస్తుతం విజయారెడ్డి ఖైరాతాబాడ్ కార్పొరేటర్ గా ఉన్నారు. తన సోదరుడు పి.విష్ణువర్థన్ రెడ్డి కాంగ్రెస్‌లోనే ఉన్న విషయం తెలిసిందే. విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..