
తెలుగు రాష్ట్రాల మధ్య రవాణా ముఖచిత్రాన్ని మార్చేసే కీలక అడుగు పడింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను అనుసంధానించే అత్యంత రద్దీ కలిగిన జాతీయ రహదారి 65 విస్తరణకు సర్వం సిద్ధమైంది. ప్రస్తుతం ఉన్న నాలుగు లైన్ల రహదారిని ఆరు లైన్లుగా మారుస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన ఈ మెగా ప్రాజెక్ట్ రెండు నగరాల మధ్య ప్రయాణాన్ని తగ్గించనుంది. హైదరాబాద్ నుండి విజయవాడ వరకు 231 కిలోమీటర్ల పొడవుగల ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.10,391 కోట్లు కాగా మొత్తం కేంద్రమే భరించనుంది. ప్రస్తుతం 4.5 నుంచి 5 గంటలు పడుతుండగా, విస్తరణ తర్వాత కేవలం 2.5 నుండి 3 గంటల్లోనే చేరుకోవచ్చు. ప్రతిరోజూ సుమారు 60,000 నుండి 80,000 వాహనాలు ఈ మార్గంలో ప్రయాణిస్తాయి.
ఈ విస్తరణ కేవలం రోడ్డు వెడల్పు చేయడం మాత్రమే కాదు ప్రయాణాన్ని అత్యంత సురక్షితంగా మరియు వేగంగా మార్చేలా ప్రణాళికలు రచించారు. నల్గొండ, సూర్యాపేట, కోదాడ, నందిగామ వంటి ప్రధాన పట్టణాల్లో ట్రాఫిక్ సమస్యను నివారించడానికి కొత్త బైపాస్‌లను నిర్మిస్తున్నారు. స్థానిక వాహనాల వల్ల ప్రధాన హైవేపై రద్దీ పెరగకుండా దాదాపు అన్ని విభాగాల్లో సర్వీస్ రోడ్లను ఏర్పాటు చేస్తున్నారు. పాదచారులు, స్థానిక వాహనాలు రోడ్డు దాటేటప్పుడు ప్రమాదాలు జరగకుండా కీలక జంక్షన్ల వద్ద అండర్ పాస్‌లను ప్లాన్ చేశారు.
సాధారణంగా హైదరాబాద్ నుండి విజయవాడకు విమానంలో వెళ్లడానికి ఒక గంట పడుతుంది. కానీ ఎయిర్‌పోర్టుకు వెళ్లడం, చెక్-ఇన్ ప్రాసెస్ కలిపితే మొత్తం 4 గంటలు పడుతుంది. ఇక మీదట ఈ 6 లైన్ల రహదారి అందుబాటులోకి వస్తే.. మీ ఇంటి నుండి కారులో బయలుదేరి 2.5 గంటల్లో విజయవాడ చేరుకోవచ్చు. ఇది విమాన ప్రయాణం కంటే తక్కువ ఖర్చుతో కూడిన వేగవంతమైన ప్రత్యామ్నాయంగా మారనుంది.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సంప్రదింపులు జరుపుతూ, పనులను వేగవంతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. 2028 అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ ప్రాజెక్టును పూర్తి చేసి, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో కాంగ్రెస్ ప్రభుత్వం తన ముద్ర వేయాలని చూస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో నివసిస్తున్న ఆంధ్రా మూలాలున్న ప్రజలకు ఈ హైవే ఒక ఎమోషనల్ లింక్. దీని నిర్మాణం పూర్తయితే రాజకీయంగా కూడా కాంగ్రెస్‌కు పెద్ద అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది.
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇప్పటికే డీపీఆర్ పూర్తి చేసింది. టెండర్ల ప్రక్రియ తుది దశలో ఉంది. పనులు ప్రారంభమైన తర్వాత రెండు సంవత్సరాల కాల పరిమితిలో దీనిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నిర్మాణ సమయంలో వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా పక్కా ప్లానింగ్‌తో అధికారులు ముందుకు వెళ్తున్నారు.