వామ్మో ఇంత మందా?.. గణేష్ నిమజ్జనాల్లో ఈవ్‌టీజింగ్‌కు పాల్పడిన పోకిరీల బెండు తీసిన షీటీమ్స్!
హైదరాబాద్ నగరంలో రోజురోజుకూ పోకిరీలు ఎక్కువైపోతున్నారు. పండగల సమయాల్లో అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ హల్చల్ చేస్తున్నారు. తాజాగా గణేష్ ఉత్సవాల సందర్భంగా ఖైరతాబాద్, బాలాపూర్ వంటి రద్దీ ప్రాంతాలలో పోకిరీ చేష్టలు వేసిన మొత్తం 2,935 మందిని అదుపులోకి తీసుకుని, కౌన్సిలింగ్, జరిమానాలు, జైలు శిక్ష వంటి చర్యలు చేపట్టారు.

హైదరాబాద్‌లో గణేష్ ఉత్సవాల సందర్భంగా మహిళలు, యువతుల భద్రతపై హైదరాబాద్ నగర పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్, అదనపు పోలీస్ కమిషనర్ (క్రైమ్స్) ఆదేశాల మేరకు సెప్టెంబర్ 14 నుంచి 26 వరకు జరిగిన గణేష్ నిమజ్జన పూర్వ ఉత్సవాల్లో షీ టీమ్స్‌ను ప్రత్యేకంగా రంగంలోకి దించారు. ముఖ్యంగా ఖైరతాబాద్ గణేష్, బాలాపూర్ గణేష్ మండపాల వద్ద భారీగా షీ టీమ్స్‌ను మోహరించి ఈవ్‌టీజింగ్, మహిళల వేధింపులు, ఇతర ఆక్షేపణీయ కార్యకలాపాలపై నిరంతర నిఘా ఏర్పాటు చేశారు.
ఉత్సవాల సమయంలో మహిళలు, యువతుల భద్రతకు భంగం కలిగించేలా వ్యవహరించిన మొత్తం 2,935 మందిని షీ టీమ్స్ అదుపులోకి తీసుకున్నాయి. వారిలో 858 మందికి విచారణ అనంతరం కౌన్సెలింగ్ నిర్వహించి, హెచ్చరించి వదిలిపెట్టారు. మరో 69 మందికి న్యాయపరమైన చర్యల్లో భాగంగా శిక్ష విధించారు. ఇందులో 24 మందికి రూ.1,050 చొప్పున జరిమానా విధించగా.. 40 మందికి సామాజిక సేవతో పాటు రూ.1,050 జరిమానా విధించారు. మరో ఐదుగురికి జరిమానాతో పాటు జైలు శిక్ష విధించినట్లు పోలీసులు తెలిపారు.
గణేష్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాల సమయంలో భారీగా భక్తులు తరలివచ్చే ప్రాంతాల్లో మహిళల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు షీ టీమ్స్ ప్రత్యేక నిఘా కొనసాగించాయి. ఖైరతాబాద్, బాలాపూర్ గణేష్ మండపాలతో పాటు ప్రధాన గణేష్ మండపాలు, రద్దీ ప్రాంతాలు, నిమజ్జన మార్గాల్లో షీ టీమ్స్ సిబ్బంది చురుగ్గా విధులు నిర్వహించారు. ఈవ్‌టీజింగ్, మహిళలపై వేధింపులు వంటి ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. పండుగ వాతావరణంలో మహిళలు, యువతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉత్సవాల్లో పాల్గొనేలా భద్రతా చర్యలను ముమ్మరం చేసినట్లు హైదరాబాద్ నగర పోలీసులు వెల్లడించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
