Hyderabad: పోలీసుల బూట్ల చప్పుడుతో హాస్టల్స్‌లో ఒక్కసారి అలజడి.. అసలు కారణం అదేనా..?

| Edited By: Balaraju Goud

Aug 09, 2024 | 4:04 PM

హైదరాబాద్ లో డ్రగ్స్ మహమ్మారిని అణచివేసేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అటు పెడ్లర్లు అంతకంతకూ చెలరేగిపోతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ క్రయ విక్రయాలు చేస్తున్నారు. యువత, విద్యార్థులే టార్గెట్ గా డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయి

Hyderabad: పోలీసుల బూట్ల చప్పుడుతో హాస్టల్స్‌లో ఒక్కసారి అలజడి.. అసలు కారణం అదేనా..?
Hyderabad City Police
Follow us on

హైదరాబాద్ లో డ్రగ్స్ మహమ్మారిని అణచివేసేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అటు పెడ్లర్లు అంతకంతకూ చెలరేగిపోతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ క్రయ విక్రయాలు చేస్తున్నారు. యువత, విద్యార్థులే టార్గెట్ గా డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ వనస్థలిపురంలో డ్రగ్స్ పట్టివేత, రాచకొండలో డ్రగ్స్ లభ్యం వంటి వార్తలే చూశాం. కానీ ఇప్పుడు నిత్యం రద్దీగా ఉండే ఎస్ఆర్ నగర్, అమీర్‌పేట్‌లోనూ డ్రగ్స్ భూతం బయటపడింది. హాస్టళ్ల అడ్డాగా మూడు పువ్వులు అరు కాయలుగా డ్రగ్స్ దందా సాగుతున్నట్లు హైదరాబాద్ నగర పోలీసులు గుర్తించారు.

హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లోని ఒక బాయ్స్ హాస్టల్ లో నలుగురు యువకులు డ్రగ్స్ సేవిస్తుండగా.. పోలీసులు వారిని రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు. ఆ ప్రాంతంలో డ్రగ్స్ సరఫరా జరుగుతుందని సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఓ హాస్టల్ కు డ్రగ్స్ సరఫరా చేశారని తెలుసుకుని, ఆ హాస్టల్ లో తనిఖీలు చేయగా యువకులు డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడ్డారు. వారి నుంచి పెద్దమొత్తంలో ఎండీఎంఏ డ్రగ్స్ ను సీజ్ చేశారు. ఇందుకు సంబంధించి నలుగురు యువకులను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు.

గత కొన్ని రోజులుగా ఎస్‌ఆర్ నగర్‌లోని హాస్టల్స్ కేంద్రంగా కొనసాగుతున్న గంజాయి, డ్రగ్స్ గుట్టు రట్టయింది. ఎస్‌ఆర్ నగర్ లోని వెంకట్ బాయ్స్ హాస్టల్లో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆకస్మిక సోదాలు చేసింది. ఈ సోదాల్లో హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను హాస్టల్ లో పట్టుకున్నారు. నిందితుల వద్ద నుండి సుమారుగా 12 లక్షల రూపాయల విలువ చేసే డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. 250 గ్రాముల గంజాయి ,115 గ్రాముల ఎం.డి.ఎం.ఏ డ్రగ్స్ పట్టుకున్నారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాలోని ముగ్గురు కీలక వ్యక్తులు మోహిత్ రావు, పసుపులేటి, రవూఫ్ లను అరెస్టు చేశారు. బెంగళూరు నుండి డ్రగ్స్ తీసుకొచ్చి నగరంలో అమ్మకాలు కొనసాగిస్తున్నారని గుర్తించారు. రవూఫ్ కు నైజీరియా కు చెందిన నెగ్గెన్ వ్యక్తితో సంబంధం ఉండటంతో డ్రగ్స్ ను సరఫరా చేస్తూ.. హాస్టల్‌ లో కూడా అమ్ముతున్నట్లు గ్రహించారు. ఇలాంటి వారిపై కఠినంగా చర్యలుంటాయని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఇలా హాస్టళ్లనే అడ్డాగా చేసుకుని మత్తు మాయగాళ్లు విచ్చలవిడిగా అమ్మకాలు చేపడుతున్నారు. ఇంత దర్జాగా హాస్టళ్లలో అమ్మకాలు, డ్రగ్స్ సేవిస్తున్న పోలీసులు మాత్రం కన్నేత్తి అయినా చూడలేదు. ఏదో డ్రగ్స్ పట్టుబడ్డాక పోలీసులు ఇప్పుడు హడావుడి మీద తనిఖీలు చేస్తున్నారు తప్పా, ముందే తనిఖీలు చేస్తే డ్రగ్స్ భూతం హాస్టల్ గడప తొక్కేదే కాదంటున్నారు స్థానికులు. విద్యార్థులు, యువత డ్రగ్స్ మహమ్మారి బారిన పడే వారు కాదు. పోలీసులు ఇప్పటికైనా క్షేత్ర స్థాయిలో తూతుమంత్రంగా తనిఖీలు చెయ్యడం కాదు. రెగ్యులర్ గా హాస్టళ్లపై పోలీసుల వాచ్ ఉండాలని స్థానికులు కోరుతున్నారు. పోలీసుల పర్యవేక్షణ లోపం వల్లే హాస్టళ్ల దుస్థితి ఇలా తయారైందని స్థానికులు అంటున్నారు.

హాస్టళ్లలో డ్రగ్స్ దొరకడమే కాదు హాస్టల్లో ఉండే వారు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ప్రైవేట్‌ హాస్టళ్లలోని కొంతమంది యువకులు డ్రగ్స్‌, గంజాయి మత్తులో ఇష్టారీతిన ప్రవర్తిస్తూ స్థానికులను భయ బ్రాంతులకు గురిచేస్తున్నారు. పోలీసులు దృష్టి సారించకపోవడంతో వారి వ్యవహారం ఆడిందే ఆట పాడిందే పాట అన్న చందంగా సాగుతోంది. ఇదేంటని ప్రశ్నిస్తే చంపడానికి కూడా వెనకాడని పరిస్థితి. ఎస్‌ఆర్‌ నగర్‌, బల్కంపేట, అమీర్‌పేటలో ఉన్న హాస్టళ్లపై స్థానిక పోలీసులు పెద్దగా నజర్‌ పెట్టడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో గంజాయి, డ్రగ్స్‌ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. హాస్టళ్లలో సగానికి పైగా వాటిలో సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. నిర్వాహకులు విద్యార్థుల నుంచి నెలనెలా డబ్బులు వసూలు చేస్తున్నారే తప్పా, హాస్టల్‌ గదుల్లో ఏం జరుగుతుందనే అనే దానిపై మాత్రం దృష్టి సారించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలువురు యువకులు తాగి వచ్చి ప్రతిరోజూ గొడవ చేస్తున్నాడని అమీర్‌పేటలో హనుమ యోగాలక్ష్మీ అన్నపూర్ణ బాయిస్‌ హాస్టల్‌ నిర్వాహకుడికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో కర్నూల్‌కు చెందిన వెంకటరమణ ప్రశ్నించడంతో ఏలూరు వాసి గణేశ్‌, గడ్డం గీసుకునే కత్తితో విచక్షణ రహితంగా దాడిచేసి దారుణంగా హత్య చేశారు.

ఎస్‌ఆర్‌ నగర్‌ బస్టాప్ డ్రగ్స్‌ విక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు యాంటీ నార్కోటిక్‌ డ్రగ్స్‌ బ్యూరో అధికారులు రంగంలోకి దిగి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 16 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. కొంతమంది యువకులు రాత్రి, పగలు తేడా లేకుండా గంజాయి సేవిస్తూ అల్లర్లకు పాల్పడుతున్నారు. బల్కంపేట శ్మశానవాటిక, బాపునగర్‌, ఈఎస్ఐ, ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ వెనుక వీధుల్లో రాత్రివేళ యథేచ్ఛగా గంజాయి, హ్యాష్‌ ఆయిల్‌ సేవిస్తున్నారని, ఇవి మట్టుకు అడ్డాలుగా మారాయని ఆరోపణలు ఉన్నాయి.

పోలీస్‌ పెట్రోలింగ్‌ అంతంతా మాత్రంగా నిర్వహిస్తుండడంతో బల్కంపేట శ్మశాన వాటిక వద్ద మత్తులో ఊగుతూ ప్రకృతి చికిత్సాలయం వద్ద ఎంఎంటీస్‌ రైలు దిగి వస్తున్న మహిళల పట్ల అసభ్యంగా ప్రవరిస్తూ బయబ్రాంతులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల బంజారాహిల్స్‌ పబ్‌లో డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్న అధికారులు పట్టుబడిన వారిలో కొంతమంది ఇచ్చిన సమాచారం మేరకు ఎస్‌ఆర్‌నగర్‌లోని వెంకట్‌ అనే హాస్టళ్లో డ్రగ్స్‌ విక్రయాలు జరుగుతున్నాయనే సమాచారంతో తనిఖీలు నిర్వహించి పెద్ద ఎత్తున డ్రగ్స్‌ స్వాధీనం చేసుకుని నలుగురు యువకులను అరెస్ట్‌ చేశారు. ఇకనైన పోలీసు లు డ్రగ్స్‌, గంజాయి విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించి అన్ని హాస్టళ్లలో సీసీ కెమెరాలు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు ఆదేశాలు ఇవ్వాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఇలా డ్రగ్స్ ఛాయలు హాస్టల్ వేదికగా ఉండడంతో హైదరాబాద్ లోని పలు హాస్టల్స్ లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు ముమ్మరం చేశారు. పంజాగుట్ట పరిధిలో 115 హాస్టళ్లలో పోలీస్ ల విస్తృత తనిఖీలు చేశారు. ఈ తనిఖీలు ఏసీపీ మోహన్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు గా ఏర్పడి సోదాలు చేశారు. ఇటీవల హాస్టల్స్ లో ఉంటూ డ్రగ్స్ సప్లై చేసిన ముఠా పట్టిబడడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. హాస్టల్స్ లో జరిగే అసాంఘిక కార్యక్రమాలపై తనిఖీలు చేపట్టారు పోలీసులు. అమీర్‌పేట్‌లోని ఓ హాస్టల్ లో వారం వ్యవధిలో ఓ మర్డర్ దొంగతనం జరిగిన పరిస్థితుల్లో పంజాగుట్ట సీఐ శోభన్ తనిఖీ చేశారు. నేరల నియంత్రణ లో భాగంగా హాస్టల్స్ లో ముందస్తు తనిఖీలు చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు, ఇతర రాష్ట్రాల నుండి ఇక్కడికి వచ్చి రూమ్స్ ఉంటున్న వారికీ ఇవ్వడం, వారి పరిస్థితులపై పోలీసులు ఆరా తీశారు. హాస్టల్స్ నిర్వాహకులను సైతం విచారించి, హెచ్చరికలు జారీ చేశారు పోలీసులు. హాస్టల్స్ లో సెక్యూరిటీ జాగ్రత్తలు తీసుకోవడం పై మేనేజ్మెంట్ తో మాట్లాడి, హాస్టల్స్ లో నిబంధనలు ఉల్లంఘిస్తే హాస్టల్స్ యాజమాన్యాల పై చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు.

ఇలా హైదరాబాద్ కేంద్రంగా హాస్టళ్ల మాటున జోరుగా సాగుతున్న డ్రగ్స్ విక్రయాలపై పోలీసులు దృష్టి పెట్టారు. తూతుమంత్రంగా తనిఖీలు చేయ్యకుండా.. రెగ్యులర్‌గా హాస్టళ్లపై పోలీసులు వాచ్ చేయాలని, హాస్టల్ యాజమాన్యాలను హెచ్చరించాల్సిన బాధ్యత పోలీసుల మీద ఎంతైనా ఉందంటున్నారు హైదరాబాదీ వాసులు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..