Hyderabad: పాత కక్షతో చోరీ.. రూ.15 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!

బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి వేళ తాళాలు వేసి ఉన్న ఇంట్లో జరిగిన దొంగతనం కేసును చాంద్రాయణగుట్ట డివిజన్, రాజేంద్రనగర్ జోన్ పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. ఈ కేసులో ఒక మహిళా నిందితురాలిని అరెస్ట్ చేసి, ఆమె వద్ద నుండి దొంగిలించబడిన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు..

Hyderabad: పాత కక్షతో చోరీ.. రూ.15 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
Bandlaguda House Robbery

Edited By:

Updated on: Jun 02, 2026 | 8:18 PM

హైదరాబాద్, జూన్‌ 2: హైదరాబాద్‌ మహా నగరంలోని బండ్లగూడ EWS కాలనీకి చెందిన ఎన్. గిరి బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మే 30న ఉదయం 9 గంటలకు యాదగిరిగుట్ట దేవాలయ దర్శనానికి వెళ్ళారు. వారు ఆలయం వద్ద ఉండగా మే 31 తెల్లవారుజామున ఆయన వదిన ఫోన్ చేసి, ఇంటి ప్రధాన తలుపు తాళం పగలగొట్టి ఉన్నట్లు సమాచారం ఇచ్చారు. బాధితుడు వెంటనే ఇంటికి వచ్చి పరిశీలించగా ప్రధాన తలుపు, బీరువా తాళాలు పగలగొట్టి ఉన్నాయి. అందులోని సుమారు 91 గ్రాముల బంగారు ఆభరణాలు, 100 తులాల వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు బండ్లగూడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ఫిర్యాదుదారుడు గిరిబాబు తన పొరుగున ఉండే కాపేరి నర్సమ్మపై అనుమానం వ్యక్తం చేశాడు. గతంలో ఆమెకు, ఫిర్యాదుదారుడి కుటుంబానికి మధ్య ఉన్న పాత గొడవలు, అలాగే గతంలో ఆమెపై ఉన్న దొంగతనం కేసుల నేపథ్యాన్ని బట్టి ఈ అనుమానం వ్యక్తం చేశాడు.

దీంతో బండ్లగూడ పోలీసులు తక్షణమే రంగంలోకి దిగి నిందితురాలు కాపేరి నర్సమ్మను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా ఆమె నేరాన్ని అంగీకరించింది. ఫిర్యాదుదారుడి కుటుంబంతో ఉన్న పాత కక్షల నేపథ్యంలో వారు యాదగిరిగుట్టకు వెళ్లిన విషయాన్ని గమనించి, ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని ఆసరాగా చేసుకుని మే 30 రాత్రి వేళలో ఇనుప పైపు, కొడవలి సహాయంతో ఇంటి తాళాలు, బీరువా పగలగొట్టినట్లు తెలిపింది. అందులో నుంచి బంగారు, వెండి ఆభరణాలను దొంగిలించినట్లు నిందితురాలు నేరం అంగీకరించింది. అనంతరం నిందితురాలి నుంచి 8.2 తులాల బంగారు ఆభరణాలు, 1 కేజీ 80 గ్రాముల వెండి ఆభరణాలను, అలాగే తాళాలు పగలగొట్టడానికి ఉపయోగించిన ఇనుప పైపు, కొడవలిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రికవరీ చేసిన ఈ మొత్తం సొత్తు విలువ సుమారు రూ.15 లక్షల వరకు ఉంటుంది. నిందితురాలి కాపరి నర్సమ్మను తదుపరి జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం కోర్టు ముందు ప్రవేశపెట్టనున్నారు. నిందితురాలికి ఇతర ఏవైనా నేరాలతో లేదా క్రిమినల్ కేసులతో సంబంధం ఉందా అనే కోణంలో తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.

 

ఇవి కూడా చదవండి

సౌకర్యార్థం ప్రజలు ఊర్లకు లేదా ఇతర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు తమ ఇళ్లకు సరైన భద్రతా తాళాలు (Locking arrangements) ఉండేలా చూసుకోవాలని, తాము ఇంట్లో లేని విషయాన్ని స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. అలాగే, వీలైనంత వరకు ఇళ్ల వద్ద సిసిటివి (CCTV) కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, కాలనీల్లో ఏవైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us