
హైదరాబాద్ మహానగరం నడిబొడ్డున జరిగిన కాల్పుల ఘట ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటనపై నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ కీలక వివరాలు వెల్లడించారు. ఈ ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణించినట్లు తెలిపారు. కాల్పుల కేసులో హత్యాయత్నంతో పాటు రాబరీ కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు భారతీయ న్యాయ సంహిత (BNS) 109, 309 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా దర్యాప్తు చేపట్టినట్లు స్పష్టం చేశారు.
కాల్పుల అనంతరం నిందితులు కాల్పులు జరిపి చాదర్‌ఘాట్ మీదుగా నింబోలిఅడ్డ–కాచిగూడ వైపు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ బట్టలు మార్చుకున్న అనంతరం కాలినడకన కాచిగూడ క్రాస్ రోడ్ వరకు వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజ్‌ల ద్వారా ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ కేసుకు సంబంధించి అనేక సీసీటీవీ దృశ్యాలను సేకరించి సవివరంగా పరిశీలిస్తున్నట్లు సజ్జన్నార్ తెలిపారు. దర్యాప్తులో భాగంగా టెక్నికల్ ఆధారాలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. ఇతర పోలీస్ కమిషనరేట్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిందితుల కదలికలపై సమాచారం సేకరిస్తున్నామని వెల్లడించారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని హైదరాబాద్ సీపీ ధీమా వ్యక్తం చేశారు.
నగర ప్రజల భద్రతే హైదరాబాద్ పోలీసుల ప్రధాన బాధ్యత అని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. ఈ కాల్పుల కేసుకు సంబంధించి నిందితులపై ఏవైనా సమాచారం తెలిసిన వెంటనే డయల్ 100కు కాల్ చేసి పోలీసులకు తెలియజేయాలని హైదరాబాద్ వాసులకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటన నేపథ్యంలో నగరంలో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేసినట్లు పోలీసులు తెలిపారు. ముఖ్య ప్రాంతాల్లో అదనపు బందోబస్తు ఏర్పాటు చేసి, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా పెంచినట్లు వెల్లడించారు. చెక్‌పోస్టుల ద్వారా వాహనాల తనిఖీలు నిర్వహిస్తూ, నగరంలో శాంతిభద్రతలు భంగం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు స్పష్టం చేశారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..