హైదరాబాద్ పరిధిలో మెట్రో కారిడార్ పొడిగింపుపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల తర్వాత హయత్‌నగర్ వరకు మెట్రో కారిడార్‌ను పొడిగించడం జరుగుతుందన్నారు. అంతేకాదు.. నాగోల్-ఎల్బీ నగర్ మధ్య మెట్రో అనుసంధానించడం జరుగుతుందన్నారు. అంతేకాదు.. త్వరలోనే మూసీపై 14 బ్రిడ్జిలను కడతామని ప్రకటించారు కేటీఆర్. వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిచేది టీఆర్ఎస్సే అని, మళ్లీ సీఎం అయ్యేది కేసీఆరేనని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం నాడు ఎల్బీనగర్ పరిధిలో మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. బండ్లగూడ చెరువు నుంచి నాగోల్ చెరువు వరకు నాలా బాక్స్ డ్రైన్‌ను ప్రారంభించారు. అలాగే సెంట్రల్ గ్రౌండ్ వాటర్ నుంచి ఫిర్జాదిగూడ వరకు.. లింక్‌రోడ్డు ప్రారంభించారు. ఫతుల్లాగూడ జంతు సంరక్షణ కేంద్రంలో.. పెట్ యానిమల్ శ్మశాన వాటిక ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడి మంత్రి కేటీఆర్.. కీలక కామెంట్స్ చేశారు. అల్లావుద్దీన్ అద్భుత దీపం, ఊకదంపుడు ఉపన్యాసాలు, చిత్రి విచిత్ర బట్టలు వేసుకుంటే అభివృద్ధి కాలేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపు, చిత్తశుద్ధితో డెవలప్‌మెంట్ సాధ్యం అయ్యిందన్నారు. 240 కోట్ల మొక్కలతో రాష్ట్రమంతా హరితహారం కార్యక్రమం చేపట్టామన్నారు. తత్ఫలితంగా.. రాష్ట్రంలో 7.7 శాతం వృద్దితో 31.7 శాతం గ్రీన్ కవర్ అయిందని వివరించారు మంత్రి. ఇప్పుడు ప్రారంభించిన నాలా పనులు వచ్చే జనవరి చివరి నాటికి పూర్తి అవుతాయన్నారు. వర్షం కాలం నాటికి మొదటి దశ నాలా పనులు మొత్తం పూర్తి చేసి ముంపు సమస్య తొలగిస్తామన్నారు.
ఇక ఈ కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్‌తో పాటు.. మంత్రి మల్లారెడ్డి కూడా పాల్గొన్నారు. ప్రపంచంలో హైదరాబాద్‌కు గుర్తింపు తెచ్చిన ఘనత మంత్రి కేటీఆర్ ది అని కొనియాడారు. వరల్డ్ టాప్ 5 కంపెనీలను హైదరాబాద్ కు తీసుకొచ్చారని ప్రశంసించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని అభివృద్ది తెలంగాణలో ఉందన్నారు. కొన్ని దుష్ట శక్తులు రాష్ట్రానికి వస్తున్నాయని బీజేపీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి మల్లారెడ్డి. ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని, వాటన్నిటినీ సీఎం కేసీఆర్ తట్టుకుంటారని అన్నారు. మనమందరం సీఎం కేసీఆర్ వెంట ఉండాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు మంత్రి మల్లారెడ్డి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..