Hyderabad: హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ మేనేజ్‌మెంట్ పెట్టిన ఓ ప్లెక్సీ తీవ్ర కలకం రేపింది. ఆ ప్లెక్సీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవడం, విమర్శలపాలవడంతో.. కాసేపటికే దానిని తొలగించారు. ఇంతకీ ఆ ప్లెక్సీలో ఏముంది? అంత వివాదాస్పదం అవడానికి కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ దోమల్‌గూడలోని ఇందిరాపార్కుకు నిత్యం అనేక మంది వస్తుంటారు. వారిలో ముఖ్యంగా ప్రేమ జంటలకు అధికంగా వస్తుంటారు. ఈ అయితే ఈ ప్రేమ జంటలు శృతి మించి ప్రవర్తిస్తుండటంతో.. అక్కడికి వచ్చే పెద్దలు, పిల్లలు, ఫ్యామిలీ మెంబర్స్ ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో ఇందిరాపార్క్ నిర్వాహకులు ఊహించని రీతిలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ‘‘పెళ్లి కాని జంటలను పార్క్‌లోనికి అనుమతించబడదు’’ అని పేర్కొంటూ ఓ ప్లెక్సీని పార్క్ బయట ఏర్పాటు చేశారు.
ఇది గమనించిన సామాజిక కార్యకర్త మీరా సంఘమిత్ర ఆ ఫోటోను ట్వీట్ చేశారు. ‘‘ఇందిరా పార్క్ ప్రజలందరిదీ. ఇందులోకి ఎవరైనా రావొచ్చు. ఈ పార్క్‌లోకి ప్రవేశానికి ‘వివాహం’ ఎలా ప్రమాణం అవుతుంది? ఇది రాజ్యాంగ విరుద్ధం.’’ అని ప్రశ్నిస్తూ.. జీహెచ్ఎంసీ ని, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని ఆ ట్వీట్‌కు ట్యాగ్ చేశారు. కాగా, ట్వీట్ కాస్తా క్షణాల వ్యవధిలోనే వైరల్ అవడంతో.. అధికారులు అలర్ట్ అయ్యారు. ట్వీట్‌కు వెంటనే స్పందించిన జీహెచ్ఎంసీ.. బ్యానర్‌ను తొలగించింది. ‘అసౌకర్యానికి చింతిస్తున్నాము’ అని పేర్కొంటూ బ్యానర్ తొలగించినట్లుగా ఉన్న మరో పిక్‌ను షేర్ చేసింది జీహెచ్ఎంసీ. ఉద్యానవనాన్ని అందరూ సందర్శించాలని, ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూడాల్సిన బాధ్యత పౌరులపై కూడా ఉందని పేర్కొంది. పార్క్‌లో నిరంతర నిఘా ఉండేలా చూడాలని స్థానిక పోలీసులకు తెలియజేసినట్లు కూడా జీహెచ్ఎంసీ పేర్కొంది.
కాగా, ఈ వ్యవహారంపై స్పందించిన జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ బి. శ్రీనివాస్.. ‘‘బ్యానర్ వ్యవహారం ఇప్పుడు తెలిసింది. ఆ బ్యానర్‌ను తొలగించాం. కింది స్థాయి సిబ్బంది ఆ బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. దాని గురించి మాకు తెలియదు. మాకు తెలిసిన వెంటనే ఆ బ్యానర్‌ను తొలగించాము’’ అని వివరణ ఇచ్చారు. అయితే, ఈ బ్యానర్ పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని మీరా డిమాండ చేశారు.
కాగా, హైదరాబాద్ ఇందిరా పార్క్‌లో మోరల్ పోలీసింగ్ కొత్తేం కాదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రేమికుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పోలీసులు పెళ్లి కాని జంటలు ట్యాంక్ బండ్ చుట్టూ, పరిసర ప్రాంతాల్లోని పార్క్‌లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో తిరగకుండా ఆంక్షలు పెట్టారు. అయితే, బజరంగ్ దళ్ సభ్యులతో ఘర్షణలు జరుగకుండా ఉండేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని పోలీసులు వివరణ ఇచ్చారు.
GHMC Twitter:
Banners removed by DD UBD. Inconvenience regretted. Informed local police to keep vigil by regular visits to maintain serene atmosphere in the park . pic.twitter.com/vqNBAdX97F
— Zonal Commissioner, Secunderabad Zone, GHMC (@ZC_Secunderabad) August 26, 2021
Also read:
Telangana Corona: తెలంగాణాలో గణనీయంగా తగ్గుతున్న కరోనా కొత్త కేసులు.. పెరుగుతున్న రికవరీ రేటు
మోడల్ ప్రాణం మీదికి వచ్చిన ఫోటోషూట్.. ఫోటోల కోసం వెళితే కోసం వెళితే చిరుతల దాడి..
Viral Video: ఇదేందిది! రాబిన్‌హుడ్‌ను మించిపోయిన చిలుక.. ఏం చేసిందో చూస్తే షాకవుతారు..