
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న రెండు, మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ ఐఎండీ అధికారులు అంచనా వేశారు. దేశ వ్యాప్తంగా ఎండల సంగతి ఎలా ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మండే కుంపటిని తలపిస్తోంది. ఒకవైపు వేడి గాలులు, మరో వైపు ఉక్కపోతలతో జనం అల్లాడి పోతున్నారు. ఉదయం 10 గంటలకే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో ఈ ఎండలకు బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు ప్రజలు. వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ సూచించింది. ప్రజలు బయటకు రావాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. ఇదిలా ఉంటే రానున్న రెండు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అలాగే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వర్షాలు కురవకపోయినప్పటికీ, గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో నెలకొన్న వేడిగాలుల నుండి నగరవాసులకు కాస్త ఉపశమనం అయితే కలిగిస్తుందని వివరించింది.
ఆదివారం నుంచి తెలంగాణలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ హైదరాబాద్ కేంద్రం అంచనా వేసింది. మరో రెండు రోజుల తరువాత రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములతో కూడిన వర్షం మంగళవారం, ఏప్రిల్ 9 వరకు మూడు రోజుల పాటు కొనసాగుతుందని పేర్కొంది. ఏప్రిల్ 8న తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీమ్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లె, మంచిర్యాలలో వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది. వాటితో పాటు కామారెడ్డిలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షం పడుతుందని IMD హైదరాబాద్ కేంద్రం తెలిపింది.
హైదరాబాద్‌లో కూడా ఇప్పటి వరకు భారీ వర్షాలు కురవలేదు. తెలంగాణలోని వివిధ జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు కురిసినా, హైదరాబాద్‌లో రానున్న కొద్దిరోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం లేదని స్పష్టం చేసింది. అయితే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని తెలిపింది. గురువారం ఒక్క రోజే హైదరాబాద్‌లోని గోల్కొండలో 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో అత్యధికంగా నల్గొండలో 43.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందని వెల్లడించారు.
గత కొన్ని రోజులుగా తీవ్రమైన వేసవిని ఎదుర్కొంటున్న రాష్ట్ర వాసులకు తెలంగాణలో వర్షాలు ఉపశమనం కలిగించే అవకాశం ఉందని IMD అధికారులు అంచనా వేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..