
హైదరాబాద్‌లో ఎంతో ప్రసిద్ధి చెందిన చేప ప్రసాదం పంపిణీకి సంబంధించి 2026 సంవత్సరపు తేదీ ఖరారైంది. బత్తిని కుటుంబ సభ్యులు అందించే ఈ చేప ప్రసాదం ఈ ఏడాది జూన్ 8వ తేదీ రాత్రి 9 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. సాధారణంగా పగటిపూట ప్రారంభమయ్యే ఈ పంపిణీ, దాదాపు 15 ఏళ్ల తర్వాత తొలిసారిగా రాత్రి వేళ మొదలుకావడం విశేషం. చేప ప్రసాదం కోసం తరలివచ్చే ఆస్తమా వ్యాధిగ్రస్తులకు నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ సిద్ధమవుతోంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ ఏడాది మృగశిర కార్తి ముహూర్తం సూర్యాస్తమయం తర్వాత వస్తోంది. అందుకే బతిని కుటుంబం రాత్రి 9 గంటలకు పంపిణీని ప్రారంభించాలని నిర్ణయించింది. బతిని కుటుంబం 1845వ సంవత్సరం నుండి, అంటే సుమారు 180 ఏళ్లుగా ఈ ప్రసాదాన్ని ఉచితంగా పంపిణీ చేస్తోంది. శ్వాసకోశ ఇబ్బందులు, ఆస్తమా వంటి వ్యాధులతో బాధపడేవారికి ఈ చేప ప్రసాదం ఒక గొప్ప ఉపశమనంగా ప్రజలు భావిస్తారు.
ఈ ఏడాది సుమారు 1.4 లక్షల కొర్రమీను చేప పిల్లలను మత్స్యశాఖ సిద్ధం చేసింది. గత ఏడాది దేశ విదేశాల నుండి సుమారు లక్ష మంది భక్తులు హాజరయ్యారు. ఈసారి ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ఎప్పటిలాగే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు, తాగునీరు మరియు వైద్య సదుపాయాలను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని బతిని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..