Hyderabad: భారీ మోసానికి ఏం ప్లాన్ చేశార్రా.. మన పోలీసులు అంతకంటే స్మార్ట్ కదా..!

హైదరాబాద్‌కు చెందిన ఓ డాక్టర్‌ను టార్గెట్‌గా చేసుకుని సైబర్ నేరగాళ్లు ఏకంగా రూ.14 కోట్లను కాజేసిన భారీ మోసానికి సంబంధించి దర్యాప్తులో కీలక పురోగతి సాధించారు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Hyderabad: భారీ మోసానికి ఏం ప్లాన్ చేశార్రా.. మన పోలీసులు అంతకంటే స్మార్ట్ కదా..!
Cyber Crime Police

Edited By:

Updated on: Dec 20, 2025 | 9:43 PM

హైదరాబాద్‌కు చెందిన ఓ డాక్టర్‌ను టార్గెట్‌గా చేసుకుని సైబర్ నేరగాళ్లు ఏకంగా రూ.14 కోట్లను కాజేసిన భారీ మోసానికి సంబంధించి దర్యాప్తులో కీలక పురోగతి సాధించారు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రాంతానికి చెందిన బ్రహ్మీనాయుడు, పవన్ కళ్యాణ్, మణిరామ్‌తోపాటు శివకృష్ణ అనే ఏజెంట్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దర్యాప్తులో భాగంగా నిందితులు సైబర్ నేరగాళ్లకు మ్యూల్ బ్యాంక్ ఖాతాలు సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. అక్రమ డబ్బు లావాదేవీల కోసం ఈ ఖాతాలను వినియోగించినట్టు ప్రాథమిక ఆధారాలు లభించాయి. బాధితుడి నుంచి మోసపూరితంగా వసూలు చేసిన భారీ మొత్తాన్ని వివిధ బ్యాంక్ ఖాతాల ద్వారా ట్రాన్స్‌ఫర్ చేసి, వాటిని సైబర్ నేరగాళ్లకు చేరవేసినట్టు విచారణలో తేలింది. నిందితులను కస్టడీలోకి తీసుకుని లోతుగా విచారిస్తే మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిందితులపై ఐదు రోజుల పోలీస్ కస్టడీ మంజూరు చేయాలంటూ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నాంపల్లి కోర్టును ఆశ్రయించింది. నిందితుల పోలీస్ కస్టడీపై సోమవారం నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించనుంది. ఈ కేసుతో సంబంధించి మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం కూడా ఉందని అధికారులు సూచిస్తున్నారు.

ఈ కేసు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు సూచించారు. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, లింక్‌లకు స్పందించకుండా ఉండాలని, అలాగే తమ బ్యాంక్ ఖాతాలు, ఓటీపీలు, కేవైసీ వివరాలను ఎవరికీ షేర్ చేయకూడదని హెచ్చరించారు. సైబర్ మోసాలపై అనుమానం వచ్చిన వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు లేదా అధికారిక సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సూచిస్తూ, ఇటువంటి నేరాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో స్పష్టం చేసింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..