భాగ్యనగరంలో తరచుగా హిట్ అండ్ రన్ కేసులు తరచుగా నమోదు అవుతున్నాయి. తాజాగా పంజాగుట్ట పీఎస్ పరిధిలో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి అడ్డు వచ్చిన వారిని కారుతో ఢీ కొడుతూ వెళ్లడంతో పలువురికి గాయాలయ్యాయి. వెంబడించి కారును అడ్డుకున్న స్థానికులు.. చితక్కొట్టారు.
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో జరిగిన హిట్ అండ్ రన్ ఘటన మరవకుందే.. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి కారు నడుపుతూ భయాందోళనకు గురి చేశారు. అడ్డు వచ్చిన వారిని ఢీకొడుతూ వెళ్లాడు. దీంతో ఆగ్రహానికి గురైన స్థానికులు.. అతి కష్టం మీద కారును వెంబడించి అడ్డుకున్నారు.
మద్యం మత్తులో కారు డ్రైవ్ చేసిన వ్యక్తిని స్థానికులు చితకబాదారు. అనంతరం పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్‌లో బుధవారం తెల్లవారుజామున పెద్దమ్మ గుడి దగ్గర బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని కారు వేగంగా ఢీకొట్టడంతో ఒకరు అక్కడికక్కడే చనిపోయాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే కారు ఢీకొట్టిన వేగానికి బైక్ 20 అడుగుల దూరం ఎగిరిపడింది. ఈ విజువల్స్ అక్కడి సీసీటీవీలో రికార్డు అయ్యాయి. వరుస ఘటనలతో వాహనదారులతో పాటు జనం వణికిపోతున్నారు. ఏ క్షణంలో ఎలాంటి ప్రమాదం జరగుతుందోనని ఆందోళన చెందుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..